‘రైజ్‌’కు నీతి ఆయోగ్‌ పట్టం | - | Sakshi
Sakshi News home page

‘రైజ్‌’కు నీతి ఆయోగ్‌ పట్టం

Mar 22 2026 2:09 AM | Updated on Mar 22 2026 2:09 AM

రూ.1.55 కోట్ల ఆర్థిక మద్దతు ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ లక్ష్మీశ

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): ఇబ్రహీంపట్నం గుంటుపల్లిలోని రూరల్‌ ఇన్నోవేషన్స్‌ ఇంక్యుబేషన్‌, స్కిల్లింగ్‌ అండ్‌ ఎంటర్‌ ప్రెన్యూర్‌షిప్‌ సెంటర్‌( రైజ్‌)కు నీతి ఆయోగ్‌ పట్టంకట్టిందని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ లక్ష్మీశ తెలిపారు. గ్రామీణ మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు చేపడుతున్న కార్యక్రమాలకు రూ. 1.55 కోట్ల ఆర్థిక మద్దతుకు ఆమోదం తెలుపుతూ తాజాగా ఉత్తర్వులిచ్చినట్లు వెల్లడించారు. దీనిపై కలెక్టర్‌ లక్ష్మీశ అధికారులతో శనివారం కలెక్టరేట్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక కుటుంబం– ఒక పారిశ్రామికవేత్త స్ఫూర్తికి అనుగుణంగా అడుగులు వేసి వినూత్నంగా రైజ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేసిందన్నారు. మహిళల ఆర్థిక సాధికారత, స్వయం ఉపాధి అవకాశాల విస్తరణ లక్ష్యంగా రూపొందించిన ఈ వినూత్న కార్యాచరణ ప్రణాళికకు నీతి ఆయోగ్‌ నుంచి గుర్తింపు లభించిందని పేర్కొన్నారు. దీనిపై సవివర నివేదిక పంపగా పరిశీలించి ఆర్థిక మద్దతుకు ప్రత్యేక కమిటీ ఆమోదం తెలిపినట్లు వివరించారు. ఈ నిధులు ఇబ్రహీం పట్నం బ్లాక్‌లో ఏఐ ఆధారిత నైపుణ్య సర్వే, నైపుణ్యాభివృద్ధి , శిక్షణ కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల కల్పన తదితరాలకు ఉపయోగపడతాయని తెలిపారు.

ఏఐ సహా విభిన్న అంశాల్లో శిక్షణ

నిత్య నూతనం– వినూత్నం నినాదానికి అనుగుణంగా మరిన్ని సృజనాత్మక కార్యక్రమాలను అమలు చేస్తామన్నారు. రైజ్‌ కేంద్రంలో హెల్ప్‌ డెస్క్‌, ఐడియా డెస్క్‌, స్కిల్లింగ్‌ డెస్క్‌, ప్లేస్‌మెంట్‌ డెస్క్‌, బ్యాంకింగ్‌ డెస్క్‌లను ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు వివరించారు. దీన్ని వినియోగించుకోవాలనుకునే ఔత్సాహికులు 70753 85588 నంబర్‌లో సంప్రదించాలని కోరారు. సమావేశంలో డీఆర్‌డీఏ పీడీ ఏఎన్‌వీ నాంచారరావు, ఇబ్రహీంపట్నం ఎంపీడీఓ శకుంతల, ఏబీపీ బ్లాక్‌ కో ఆర్డినేటర్‌ పి. శ్రీనివాస్‌, రైజ్‌ మేనేజర్‌ బి.తేజస్విని పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement