పోలీసులకు సవాల్‌గా మారిన చోరీ కేసు | - | Sakshi
Sakshi News home page

పోలీసులకు సవాల్‌గా మారిన చోరీ కేసు

Mar 22 2026 2:09 AM | Updated on Mar 22 2026 2:09 AM

పెనమలూరు: మండలంలోని తాడిగడప గ్రామంలో శుక్రవారం జరిగిన దొంగతనం మిస్టరీగా మారింది. గతంలో ఎరన్నడూ లేని విధంగా భారీ దొంగతనం జరగటంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. రూ.10 లక్షల విలువైన నగదు, బంగారు ఆభరణాలను దొంగలు దోచుకెళ్లిన ఈ ఘటన పోలీసులకు సవాల్‌గా మారింది. విజయవాడ నగర శివారులో ఉన్న తాడిగడప మునిసిపాలిటీలో పరిధిలో గతంలో చెదురుమదురుగా దొంగతనాలు జరిగాయి. ఇంటికి తాళం వేసి ఉంటే దొంగలు నేరాలకు పాల్పడిన ఘటనలు ఉన్నా పెద్దగా సొత్తు చోరీ జరగలేదు. చైన్‌ స్నాచింగ్‌, సెల్‌ఫోన్‌ చోరీలు, ఇంటి తాళాలు పగులకొట్టి చోరీలు వంటి ఘటనలు నమోదయ్యాయి. అయితే తాడిగడపలో జరిగిన దొంగతనం అందుకు భిన్నంగా ఉంది. ఇంటి యజమాని తాతేశ్వరరావు కుటుంబ సభ్యులు బెంగళూరుకు వెళ్లారు. తాళం వేసి ఉన్న ఇంటి కిటికీ ఇనుప ఊచల (గ్రిల్‌)ను చాకచక్యంగా కోసిన దొంగలు లోనికి ప్రవేశించి చోరీకి పాల్పడ్డారు. నగదు రూ.2.34 లక్షలు, వంద గ్రాములకు పైగా బంగారు ఆభరణాలు, 230 గ్రాముల వెండి వస్తువులను దోచుకున్నారు. ఈ ప్రాంతంలో ఇది పెద్ద దొంగతనంగా స్థానికులు చెబుతున్నారు.

దొంగలు ఎవరు..?

తాడిగడపలో జరిగిన భారీ చోరీలో దొంగలు ఎవరనేది తేలలేదు. నేర ప్రాంతంలో క్లూస్‌ టీమ్‌ బృందం వేలిముద్రలు సేకరించింది. అయితే ఈ ప్రాంతంతో పాటు పక్క జిల్లాలో ఉన్న దొంగల వేలిముద్రలకు అవి సరిపోలేదని సమాచారం. సీసీ పుటేజీ ప్రకారం నలుగురు దొంగలు చోరీకి పాల్పడ్డారు. దొంగలు ఉత్తర భారత్‌కు చెందిన వారిగా పోలీసులు భావిస్తున్నారు. బిహార్‌ లేదా ఉత్తరాధి ప్రాంతాలకు చెందిన వారని అనుమానలు వ్యక్తమవుతున్నాయి. ఈ చోరీ కేసు పోలీసులకు పెద్ద సవాల్‌గా మారింది. విజయవాడ నగరానికి కూతవేటు దూరంలో తాడిగడపలో జరిగిన దొంగతనం ఇటు కృష్ణా జిల్లా పోలీసులకు, అటు ఎన్టీఆర్‌ జిల్లా పోలీస్‌ కమిషనరేట్‌ ఉలిక్కపడే విధంగా చేసింది. దొంగలు ఇతర ప్రాంతాలకు చెందిన వారిగా భావిస్తుండటంతో ఏదన్న ప్రత్యేక గ్యాంగ్‌ ఈ ప్రాంతంలో సంచరిస్తోందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా కిటికీ ఇనుప గ్రిల్‌ను కట్‌ చేసి చోరీకి పాల్పడటం కలవరపరుస్తోంది. ఇటువంటి దొంగనం ఇక్కడ ఎప్పుడూ జరగలేదు. తాడిగడప మునిసిపాలిటీ, పెనమలూరు మండలంలో పోలీసుల రాత్రి గస్తీ పెంచాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement