లబ్బీపేట(విజయవాడతూర్పు): మత సామరస్యాన్ని పెంపొందించి, ఐక్యతను చాటే పర్వ దినం పవిత్ర రంజాన్ అని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ అన్నారు. పవిత్ర రంజాన్ సందర్భంగా ముస్లింలు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. నెల రోజులు కఠోర ఉపవాస దీక్షలు చేపట్టిన ముస్లింలు అందరూ సుఖసంతోషాలతో జీవించేలా అల్లా అనుగ్రహించాలని అవినాష్ ఆకాంక్షించారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ముస్లిం మైనారిటీల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి దేనని గుర్తుచేశారు.
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): అకాల వర్షాలపై పూర్తి అప్రమత్తంగా ఉన్నామని, వ్యవసాయ, ఉద్యాన తదితర శాఖల అధికారులు క్షేత్రస్థాయిలోనే ఉన్నారని, వివిధ పంటలకు సంబంధించి పారదర్శకంగా పంట నష్టాలను అంచనా వేస్తున్నామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. తుది నివేదికల ఆధారంగా పరిహారం అందుతుందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. అకాల వర్షాలు వ్యవసాయ, ఉద్యాన పంటలకు కలిగించిన నష్టంపై శుక్రవారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీసీకి కలెక్టర్ లక్ష్మీశ, జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియతో కలిసి కలెక్టరేట్ నుంచి హాజరయ్యారు. అకాల వర్షాలు, గాలులు, వడగళ్లు వల్ల వివిధ పంటలకు జరిగిన నష్టాల వివరాలపై ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. జిల్లాలో అకాల వర్షాలు, గాలుల వల్ల వరి, మొక్కజొన్నతో పాటు స్వల్పంగా జొన్న, మినుము పంటలకు నష్టం వాటిల్లిందని, అరటి, బొప్పాయి పంటలు కూడా కొన్నిచోట్ల దెబ్బతిన్నాయని వివరించారు. తుది నివేదికల ఆధారంగా నష్ట పోయిన ప్రతిరైతుకు పరిహారం అందజేస్తామని పేర్కొన్నారు. వివిధ పంటలకు సంబంధించి క్షేత్రస్థాయిలో వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు చేసే సూచనలను అన్నదాతలు పాటించాలని కలెక్టర్ పేర్కొన్నారు.
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లింలకు కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ శుక్రవారం హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాస ఉపవాస దీక్షలు మనస్సును పరిశుభ్రం చేయడమే కాకుండా, అవసరంలో ఉన్నవారిపై సానుభూతి కలిగించే గొప్ప సాధనమని పేర్కొన్నారు. ప్రతి ఇంటా ఆనందం వెల్లివిరియాలని, ప్రతి హృదయంలో శాంతి నిండాలని, సమాజంలో సౌభ్రాతృత్వం చిరస్థాయిగా నెలకొనా లని కలెక్టర్ లక్ష్మీశ ఆకాంక్షించారు.
రెడ్డిగూడెం: ఆస్తి వివాదం నేపథ్యంలో మండలంలోని కొత్తనాగులూరులో గత నెల 25న రెండు వర్గాల వారు కత్తులు, కర్రలతో దాడులు చేసుకున్న ఘటనకు సంబంధించి పది మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఇరు వర్గాల ఫిర్యా దుల మేరకు పోలీసులు హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. ఇరువర్గాల పరస్పర కేసుల్లో మొత్తం పది మందిని శుక్రవారం అరెస్టు చేశారు. నిందితులు మట్టకొయ్య డేవిడ్‌రాజు, మట్టకొయ్య రుషారావు, కట్ట అబ్రహాం, మట్టకొయ్య పద్మ, కట్ట ఎస్తేరు, కట్ట సౌజన్య, కట్ట జమలయ్య, కట్ట శ్రీను, కట్ట దేవసహాయం, కట్ట హర్షవర్ధన్‌ను జేఎఫ్‌సీఎం మైలవరం కోర్టులో హాజరు పర్చినట్లు రెడ్డిగూడెం ఎస్‌ఐ ఎస్.శ్రీను తెలిపారు.
పెదకాకాని: బాజీబాబా దర్గా రెండు రోజుల ఉరుసు మహోత్సవం శుక్రవారం ప్రత్యేక ప్రార్థనలతో ముగిసింది. పెదకాకాని సయ్యద్ బాజీ షహీద్ అవులియా దర్గా 538వ ఉరుసు మహోత్సవం పురస్కరించుకొని రాష్ట్ర నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్‌బోర్డు ఆధ్వర్యంలో వక్ఫ్‌బోర్డు అధికారులు మహ్మద్ హుస్సేన్, దర్గా ఈఓ షేక్ ఖాజావలి ఏర్పాట్లను పర్యవేక్షించారు. దర్గా ఉరుసు మహోత్సవం సాంప్రదాయ పద్ధతిలో భాగంగా పెదకాకాని పొలిమేర సెంటర్ నుంచి ప్రత్యేక చాందినీ అలంకరణలో గంధం బిందెలతో గురువారం రాత్రి ప్రారంభమైంది. బాజీబాబా వారి గుర్రం శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల వరకూ వెనిగండ్ల, పెదకాకాని వీధుల్లో గ్రామోత్సవం జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు బాజీబాబా వారి గుర్రానికి మిఠాయిలు, పండ్లు తినిపించారు. కొబ్బరికాయలు, పూలు, గంధం సమ ర్పించి భక్తిశ్రద్ధలను చాటుకున్నారు.


