కోర్టులో తప్పించుకున్నా.. ప్రజా క్షేత్రంలో శిక్ష తప్పదు | - | Sakshi
Sakshi News home page

కోర్టులో తప్పించుకున్నా.. ప్రజా క్షేత్రంలో శిక్ష తప్పదు

Mar 21 2026 5:28 AM | Updated on Mar 21 2026 5:28 AM

కోర్టులో తప్పించుకున్నా.. ప్రజా క్షేత్రంలో శిక్ష తప్పదు ప్రజలకు మెరుగైన సేవలే లక్ష్యం వైదిక కమిటీలో మరో నలుగురికి చోటు

అధికారంలోకి రాగానే చంద్రబాబుపై కేసులు ఎలా కొట్టివేస్తారు?

జై భీమ్‌ రావ్‌ భారత్‌ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్‌ కుమార్‌

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): తనపై నమోదైన కేసులను కొట్టివేయించు కోవడం లోనూ, రెండెకరాలతో రాజకీయం మొదలు పెట్టి దేశంలోనే అత్యంత ధనిక సీఎంగా ఎదగడంలోనూ సీఎం చంద్రబాబు చరిత్ర సృష్టించారని జై భీమ్‌రావ్‌ భారత్‌ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్‌కుమార్‌ విమర్శించారు. గాంధీనగర్‌లోని తన కార్యాలయంలో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. రెండెకరాలతో రాజకీయం ప్రారంభించి దేశంలోనే అత్యంత ధనికుడైనా సీఎంగా చంద్రబాబు ఘనత సాధించారన్నారు. ఆయన అధికారికంగా ప్రకటించిన ఆస్తుల విలువే రూ.981 కోట్లని వివరించారు. భూమి అంతరించే వరకూ రాష్ట్రం మొత్తాన్ని పోషించగల సత్తా ఆయనకు ఉందని, అంతగా ఆస్తులు సంపాదించారని పేర్కొన్నారు. దేశంలో తొలిసారి మిస్టేక్‌ ఆఫ్‌ ఫ్యాక్ట్‌ కింద నాలుగు కేసులను కొట్టేసిన చరిత్ర ఏపీ సీఐడీకి దక్కుతుందని విమర్శించారు. ఇప్పటి వరకూ పెండింగ్‌లో ఉన్న కేసుల్లో ఒక్క కేసు అయినా మిస్టేక్‌ ఆఫ్‌ ఫ్యాక్ట్‌ కింద క్లోజ్‌ చేశారా? అని ప్రశ్నించారు. సీఎంగా ఉన్న వ్యక్తి వ్యవస్థలను తన చేతుల్లోకి తీసు కుంటే రాజ్యాంగానికి ఉన్న విలువ ఏమిటని ఆవేదన వ్యక్తంచేశారు. తమపై పెట్టిన కేసులు ఎప్పుడు తీసేస్తారని హోంమంత్రి అనితకు లోకేష్‌ పబ్లిక్‌ మీటింగ్‌లో డైరెక్షన్‌ ఇచ్చారని గుర్తు చేశారు. లోకేష్‌ డైరెక్షన్‌ను హోంమంత్రి అనిత తూ.చ. తప్పక పాటించారన్నారు. చంద్రబాబు న్యాయస్థానాల్లో తప్పించుకో వచ్చు కానీ ప్రజా కోర్టులో శిక్ష తప్పదని స్పష్టంచేశారు.

ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌, వీఎంసీ స్పెషల్‌ ఆఫీసర్‌ లక్ష్మీశ

పటమట(విజయవాడతూర్పు): ప్రజలకు మెరుగైన సేవలు అందించడం, ప్రజా సౌకర్యాలను విస్తరించడం తన ప్రధాన లక్ష్యమని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌, వీఎంసీ ప్రత్యేక అధికారి డాక్టర్‌ జి.లక్ష్మీశ అన్నారు. స్థానిక సంస్థల గడువు ముగియటంతో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక అధికారుల బాధ్యతల్లో భాగంగా ఆయన విజయవాడ నగరపాలక సంస్థకు ప్రత్యేక అధికారిగా శుక్రవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. వీఎంసీ ప్రధాన కార్యాలయంలోని మేయర్‌ చాంబర్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విజయవాడ నగరాన్ని సీఎం ఎప్పుడు ‘గేట్‌ వే టు అమరావతి’గా పేర్కొంటారని, అందుకు అనుగుణంగా నగరాన్ని తీర్చిదిద్దేందుకు తాను కృషి చేస్తానని పేర్కొన్నారు. అనంతరం ఆయన వీఎంసీ విభాగాధిపతులతో సమావేశం నిర్వహించి, నగరంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, ప్రాజెక్టులు, వివిధ కార్యక్రమాలపై సమీక్షించారు. అనంతరం వీఎంసీ ప్రధాన కార్యాలయంలోని వివిధ శాఖలను సందర్శించారు. దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం ఈఓ శీనా నాయక్‌, అడిషనల్‌ కమిషనర్లు డాక్టర్‌ డి.చంద్రశేఖర్‌, ఎ.రవీంద్రరావు, చీఫ్‌ మెడికల్‌ హెల్త్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ కె. అర్జునరావు, చీఫ్‌ ఇంజినీర్‌ (ఇన్‌చార్జ్‌) పి.సత్యకుమారి, డెప్యూటీ కమిషనర్‌ (రెవెన్యూ) జి.సృజన తదితరులు పాల్గొన్నారు.

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థాన వైదిక కమిటీకి అదనంగా సహాయకులు, సలహాదారులను నియమిస్తూ ఈఓ శీనానాయక్‌ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. దేవస్థాన వైదిక కమిటీలో ఆరుగురు సభ్యులుగా ఉంటారు. దేవస్థాన స్థానాచార్యతో పాటు వేద పండితులు, ప్రధాన అర్చకులు, అర్చకులు ఈ కమిటీలో సభ్యుగా ఉంటారు. ప్రస్తుతం కమిటీలో స్థానాచార్య శివప్రసాద్‌ శర్మ, వేద పండితులు ఆంజనేయ ఘనాపాటి, శ్యావస్య మహర్షి, ప్రధాన అర్చకులు వై.మల్లేశ్వరశాస్త్రి, ఎల్‌.దుర్గాప్రసాద్‌తో పాటు ఉప ప్రధాన అర్చకుడు కె.ఎన్‌.వి.డి.ఎంప్రసాద్‌ సభ్యులుగా ఉన్నారు. వారికి సమన్వయ సహాయకులు, సలహాదారులుగా వేద పండితుడు షణ్ముఖేశ శాస్త్రి, ఉప ప్రధాన అర్చకుడు బి.శంకరశాండిల్య, ముఖ్య అర్చక రంగావజ్జుల శ్రీనివాసశాస్త్రి, అర్చక వి.శ్రీధర్‌శర్మను నియమించారు. ఈ నియామకం శుక్రవారం నుంచే అమలులోకి వచ్చిందని ఆలయ అధికారులు పేర్కొన్నారు. అమ్మవారి ఆలయంలో నిర్వహించే వైదిక కార్యక్రమాలు, పూజలు, నివేదనలను పర్యవేక్షించేందుకు ఈ అదనపు బృందం దోహపడుతుందని ఆలయ అధికారులు పేర్కొంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement