వర్షానికి దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం ఇవ్వాలి | - | Sakshi
Sakshi News home page

వర్షానికి దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం ఇవ్వాలి

Mar 21 2026 5:28 AM | Updated on Mar 21 2026 5:28 AM

వర్షానికి దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం ఇవ్వాలి

కంచికచర్ల: ఇటీవల ఈదురు గాలులతో కూడిన అకాల వర్షానికి నందిగామ నియోజకవర్గంలో పలు గ్రామాల్లో రైతులు సాగుచేసిన మొక్కజొన్న, బొప్పాయి, అరటితోటలు పూర్తిగా నేలవాలి దెబ్బతిన్నాయని, నష్టపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే పరిహారం ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్‌ మొండితోక జగన్‌మోహన్‌రావు డిమాండ్‌ చేశారు. మండలంలోని కీసర నేషనల్‌ హైవే పక్కన అకాల వర్షానికి దెబ్బతిన్న మొక్కజొన్న, బొప్పాయి, అరటి తోటలను రైతులతో కలిసి ఆయన శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ మొండితోక జగన్‌మోహన్‌రావు మాట్లాడుతూ.. రైతులు మొక్కజొన్న సాగుచేసిన 150 ఎకరాలను పరిశీలించగా కేవలం పదెకరాలు మాత్రమే బాగుందని, 140 ఎకరాల్లో పంట పూర్తిగా నేలవాలిందని వివరించారు. క్వింటా మొక్కజొన్నకు మద్దతు ధర రూ.2400గా ప్రకటించినా ప్రభుత్వం కొనుగోలు చేయటం లేదని విమర్శించారు. దళారులు క్వింటా మొక్క జొన్న రూ.1500లోపు మాత్రమే కొంటున్నారని వివరించారు. ప్రధాన మంత్రి ఫసల్‌ బీమా యోజన యాప్‌ పనిచేయక రైతులు బీమా చేయించుకోలేకపోయారని పేర్కొన్నారు. గత వైఎస్సార్‌ సీపీ పాలనలో రైతులు సాగుచేసిన అన్నిరకాల పంటలకు ప్రభుత్వమే నేరుగా ఇన్సూరెన్స్‌ చేయించిందని గుర్తుచేశారు. ఆరుగాలం కష్టపడి పండించిన పెసరను మార్క్‌ఫెడ్‌ ద్వారా విక్రయించాలంటే క్వింటాకు రూ.650 చొప్పున రైతుల నుంచి అధికార పార్టీకి చెందిన నాయకుడు ఒకరు వసూలు చేస్తున్నారని విమర్శించారు. ఈ వసూలు పర్వంలో ప్రజాప్రతినిధులకు కూడా వాటా ఉందని రైతులు తమ వద్ద మొరపెట్టుకున్నారని వివరించారు. రైతులను నిర్లక్ష్యం చేసే ఏ ప్రభుత్వమూ సుఖంగా ఉండదని, రైతుల ఉసురు తగులుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ నాయకులు నెలకుదిటి శివనాగేశ్వరరావు, చలమల ప్రభాకర్‌, మద్దుకూరు సాయిబాబు, వేమవరపు పురుషోత్తం, సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు.

మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ మొండితోక

జగన్‌మోహనరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement