ఎ.కొండూరు: తన భార్యపై ఉన్న అనుమానం ఒక వ్యక్తిని నేరస్తుడిని చేసింది. ఓ వ్యక్తిపై హత్యాయత్నా నికి కారణమైంది. ఎ.కొండూరు ఎస్‌ఐ మహాలక్ష్మణడు కథనం మేరకు.. మండలంలోని పెద్ద తండా గ్రామంలో లావూరి సీతారాం నివసిస్తున్నాడు. తన భార్యకు చీమలపాడు గ్రామానికి చెందిన పటాపంచల జమలయ్యతో వివాహేతర సంబంధం ఉందని అనుమానించాడు. ఈ విషయం నలుగురికీ తెలిస్తే తన పరువు పోతుందని సీతారాం భావించాడు. జమలయ్యపై ద్వేషం పెంచుకున్నాడు. అతడిని అంత మొందించాలని పథకం పన్నాడు. ఈ నేపథ్యంలో జమలయ్య కదలికలపై నిఘా ఉంచాడు. జమలయ్య నిత్యం పొలం వెళ్లొస్తున్నాడని గుర్తించాడు. ఈ నేపథ్యంలో జమలయ్య పెద్దతండా సమీపంలో మొక్క జొన్న చేను నుంచి వస్తుండగా అప్పటికే అతని కోసం పొంచివున్న సీతారాం ఒక్కసారిగా గొడ్డలితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన జమలయ్యను కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతను చికిత్స పొందుతున్నాడు. దాడి సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఘటనాస్థలానికి చేరుకుని దాడికి ఉపయోగించిన గొడ్డలిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల విచారణలో నిందితుడు సీతారాం తన నేరాన్ని అంగీకరించాడు. కుటుంబ సమస్యలు, భార్య ప్రవర్తనపై కలిగిన అనుమానమే ఈ దాడికి కారణమని పేర్కొన్నారు. అతనిపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి తిరువూరు కోర్టులోని హాజరుపరిచారు. నిందితుడికి కోర్టు రిమాండ్ విధించిందని ఎస్‌ఐ మహాలక్ష్మణుడు తెలిపారు. నిందితుడిని నూజివీడు సబ్‌జైలుకు తరలించారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ బి.శ్రీమన్నారాయణ, యు.తిరపతిరావు పాల్గొన్నారు.


