పెనమలూరు: మండలంలోని తాడిగడప గ్రామంలో గురువారం అర్ధరాత్రి దొంగలు హల్‌చల్ చేశారు. గ్రామంలో ఒక ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. గ్రామస్తులు, పోలీసుల కథనం మేరకు.. తాడిగడప గ్రామంలో తాళం వేసివున్న టి.తాపేశ్వరరావు ఇంటిలో అర్ధరాత్రి దొంగల చొరబడ్డారు. ఇంటి కిటికీలు ధ్వసం చేసి, లోపలికి ప్రవేశించిన వారు బీరువాలో ఉన్న విలువైన బంగారు ఆభరణాలు, సొమ్ము చోరీ చేశారు. ఇంటి యజమాని బెంగళూరుకు వెళ్లిన సమయం చూసి దొంగలు చోరీకి పాల్పడ్డారు. దొంగ తనం జరిగిన విషయాన్ని సీసీ కెమెరాలో ఇంటి యజమాని చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామంలో మరో ఇంట్లో కూడా దొంగతనానికి ఆగంతకులు విఫల యత్నం చేశారు. దొంగల అలికిడి విని ఇంట్లో వారు బిగ్గరగా అరవటంతో వారు పారిపోయారు. పోలీసులు వచ్చి సీసీ కెమెరా పుటేజీ పరిశీలించారు. పోలీసు జాగిలాలు, క్లూస్ టీమ్‌ను రంగంలోకి దించారు. చోరీ జరిగిన ఇంటి యజమాని అందుబాటులో లేకపోవటంతో ఎంత మేరకు సొత్తు చోరీ జరిగిందో తేలాల్సి ఉంది. అయితే దొంగలు పెద్ద ఎత్తున ఆభరణాలు చోరీ చేశారని గ్రామస్తులు చెబుతున్నారు. గ్రామంలో దొంగలు హల్‌చల్ చేయటంతో గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు.
నాగాయలంక: మండలంలోని దిండి గ్రామానికి చెందిన జన్ను బసవదేవుడు (40) ఎలుకల మందు తిని మృతి చెందాడు. నాగాయలంక ఎస్‌ఐ కలిదిండి రాజేష్ కథనం మేరకు.. ఆయన కథనం మేరకు బసవదేవుడు భార్య నాగమణి, పిల్లలతో కొంత కాలంగా విజయవాడలో నివసిస్తున్నాడు. ప్రస్తుతం అతని కుమారుడు దిండిలో నాయనమ్మ ఇంటి వద్ద ఉంటున్నాడు. కుమారుడిని తీసుకెళ్లడానికి బసవదేవుడు దిండి గ్రామానికి వచ్చాడు. ఎలుకల మందు బిళ్లలు తిని గ్రామంలోని చెరువు గట్టు మీద పడి ఉండటాన్ని బంధువులు గురువారం మధ్యాహ్నం గమనించి అవనిగడ్డ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతిచెందాడు. భార్యాభర్తల నడుమ తగవులే అతని మృతికి కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతుడి భార్య నాగమణి ఫిర్యాదు ప్రకారం అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్‌ఐ రాజేష్ తెలిపారు.


