60 కిలోల రాగి తీగలు స్వాధీనం
తెనాలిరూరల్: ౖరెల్వేకు సంబంధించిన వైర్లను దొంగిలించి వాటిని కాల్చి రాగి తీగలను అమ్మిన నిందితులను ఆర్పీఎఫ్ అధికారులు అరెస్ట్ చేసి నిందితుల వద్ద వైర్లు, రాగి తీగలను స్వాధీనపర్చుకున్నారు. తెనాలి ఆర్పీఎఫ్ ఇన్‌స్పెక్టర్ బి.హీరాసింగ్ వివరాలను శుక్రవారం వెల్లడించారు. తెనాలి రైల్వే స్టేషన్ టెలికాం స్టోరులో ఈ నెల 8వ తేదీన సుమారు రూ. 2.25 లక్షల విలువైన వైర్లు అపహరణకు గురయ్యాయి. నిందితులు స్టోర్ రూమ్ కిటికీ అద్దాలను ధ్వంసం చేసి చోరీకి పాల్పడ్డారు. దీనిపై కేసు నమోదు చేసిన ఆర్పీఎఫ్ అధికారులు నిందితుల ఆచూకీ కోసం ప్రయత్నించారు. నిందితులు కావలికి చెందిన దార్ల శ్రీను, దార్ల సింహాద్రి, దార్ల పుట్టయ్య, పర్తపు దుర్గయ్య, పర్తపు వల్లూరయ్య, నెల్లూరుకు చెందిన పర్తపు శ్రీనుగా గుర్తించారు. నిందితులు కొంత కాలంగా తెనాలి వీఎస్‌ఆర్ కళాశాల ఎదురు కఠెవరం కాల్వ కట్టకు వెళ్లే దారిలో ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట పాకలు వేసుకుని ఉంటున్నారు. అదను చూసి రైల్వే వైర్లను దొంగలించారు. అపహరించిన వైరులో సగ భాగం కాల్చి రాగి తీగలను నందివెలుగులోని ఓ వ్యక్తికి విక్రయించారు. నందివెలుగు అతను విజయవాడలోని మరో వ్యక్తికి విక్రయించాడు. విజయవాడ వ్యక్తి విజయవాడ ఆటోనగర్‌లోని ఇంకో వ్యక్తికి విక్రయించాడు. చోరీకి పాల్పడిన ఆరుగురు నిందితులతో పాటు చోరీ సొత్తును కొనుగోలు చేసిన ముగ్గురిని అరెస్ట్ చేసినట్టు ఇన్‌స్పెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో తెనాలి ఆర్పీఎఫ్ ఏఎస్‌ఐ శివరామకృష్ణయ్య, విజయవాడ ఆర్పీఎఫ్ క్రైమ్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ మధుసూదనరావు, సిబ్బంది ఉన్నారు.


