‘ఉప్పలూరు’ దోషులను కఠినంగా శిక్షించాలి
కృష్ణలంక(విజయవాడతూర్పు): సంక్రాంతి వేళ ఉప్పలూరు కోడి పందేల బరుల వద్ద కూలీలపై చేసిన దాడిపై ప్రభుత్వం న్యాయ విచారణ చేసి దోషులను కఠినంగా శిక్షించాలని రౌండ్‌టేబుల్‌లో పలువురు వక్తలు డిమాండ్ చేశారు. ఈ నెల 27న బాధితులను పరామర్శించి భరోసా కల్పించడానికి దళిత, బీసీ, ప్రజా సంఘాలు చలో తోట్లవల్లూరు కార్యక్రమం నిర్వహించాలని తీర్మానించారు. గవర్నర్‌పేటలోని బాలోత్సవ భవన్‌లో కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్) ఆధ్వర్యంలో కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి అధ్యక్షతన గురువారం ‘ఉప్పలూరు’ దాడిపై రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. పౌర హక్కుల సంఘం నాయకుడు పి.సురేష్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వాలు బలహీనులకు అండగా ఉండాల్సిన హక్కుల కమిషన్లను నిర్వీర్యం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి మాట్లాడుతూ అనాగరిక చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీపీఎం రాష్ట్ర నాయకుడు వై.నరసింహరావు, దళిత బహుజన ఫ్రంట్ వ్యవస్థాపకుడు కె.వినయ్ కుమార్ మాట్లాడుతూ దళిత బడుగు బలహీన వర్గాలపై దాడులు పెరిగాయనడానికి ఈ ఘటనే నిదర్శనమన్నారు. తోట్లవల్లూరుకు చెందిన బాధితుడు వల్లూరి సురేష్ మాట్లాడుతూ ఉప్పలూరులో ఏర్పాటు చేసిన కోడిపందేల బరిలో పని చేసేందుకు గ్రామం నుంచి 11 మందిని తీసుకువెళ్లారని, కూలీ డబ్బులు అడగగా నిర్వ్వాహకులు తమ డబ్బులు పోయాయంటూ చొక్కాలు ఊడదీసి చేతులను తాళ్లతో కట్టేసి 24 గంటల పాటు నిర్బంధించి దాడి చేశారని వాపోయారు. సమావేశంలో ఐద్వా రాష్ట్ర కార్యదర్శి వి.సావిత్రి, ఏపీ కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.హరిబాబు తీయ దళిత గిరిజన బహుజన జేఏసీఅధ్యక్షుడు బందెల కిరణ్ రాజ్, రైతు సంఘం సీనియర్ నాయకుడు వై.కేశవరావు తదితరులు పాల్గొన్నారు.
రౌండ్‌టేబుల్ సమావేశంలో వక్తలు


