శివగంగ సొసైటీలో నిధుల గోల్‌మాల్!
● రూ.5 కోట్లకు పైగా గల్లంతైనట్లు ఆరోపణలు
● ఆందోళన చెందుతున్న రైతులు, డిపాజిటర్లు
● సొసైటీ సీఈఓను సస్పెండ్ చేసిన అధికారులు
చిలకలపూడి(మచిలీపట్నం): మచిలీపట్నం నగరంలోని శివగంగ సొసైటీలో నిధులు గోల్‌మాల్ అయినట్లు తెలుస్తోంది. సొసైటీ సీఈఓ కొల్లూరి రాజేష్ 2021వ సంవత్సరం నుంచి సొసైటీ నిధులను సొంత నిధుల్లా వాడుకుని స్వాహా చేసినట్లు విశ్వసనీయ సమాచారం. అప్పటి నుంచి రైతులకు ఇచ్చిన లోన్లకు సంబంధించి వారు చెల్లించిన సొమ్ముకు సరైన మొత్తంలో రశీదులు ఇవ్వకపో వటం, సొసైటీలో డిపాజిట్ చేసిన నగదును ఫోర్జరీ సంతకాలతో స్వాహా చేసినట్లు తెలుస్తోంది. సొసైటీ సభ్యులు నిబంధనల ప్రకారం స్వల్ప, దీర్ఘకాలిక రుణాలు తీసుకుంటే ధ్రువపత్రాలు సమ ర్పించాల్సి ఉంటుంది. వీటితో పాటు వారి పొలం కాగితాల ధ్రువీకరణ పత్రాలు సమర్పించి రుణాలు పొందుతారు. రుణాలు పొందే రైతులు సొసైటీ ద్వారా జిల్లా సహకార కేంద్ర బ్యాంక్‌లో రుణం తీసుకుంటారు. ఈ రుణానికి సంబంధించి నిర్ణీత సమయంలో రుణం చెల్లించేందుకు వచ్చిన రైతుల వద్ద నుంచి కట్టాల్సిన సొమ్మును తీసుకుని, దానికి సంబంధించి ఎటువంటి రికార్డులు నిర్వహించకుండా సొంతంగా సొసైటీ సీఈఓ కై ంకర్యం చేసినట్లు విచారణలో తేటతెల్లమైంది.
డిపాజిటర్ల సొమ్ము
ఫోర్జరీ సంతకాలతో స్వాహా
కొంత మంది సభ్యులు ఎక్కువ వడ్డీ వస్తుందనే ఆశతో సహకార సంఘంలో డిపాజిట్లు చేశారు. వీటిని సహకార కేంద్ర బ్యాంకులో తిరిగి డిపాజిట్ చేయాల్సి ఉంది. ఆ డిపాజిట్ల సొమ్ముపై సొసైటీ సీఈఓ కొల్లూరి రాజేష్ కన్నుపడి డిపాజిట్‌దారుల సంతకాలను ఫోర్జరీ చేసి రూ.60 లక్షల వరకు స్వాహా చేసినట్లు విశ్వసనీయ సమాచారం. దీర్ఘకాలిక రుణాలకు సంబంధించి దరఖాస్తు చేసుకున్న సభ్యుల ధ్రువీకరణ పత్రాలు పరిశీలించిన అనంతరం పాలకవర్గ సమావేశంలో పెట్టి తీర్మానం చేయాలి. ఆ తరువాత, సహకార కేంద్ర బ్యాంకు ఆ దరఖాస్తులను పరిశీలించి రుణాలు మంజూరు చేస్తుంది. అయితే సహకార బ్యాంకు అధికారులకు సమాచారం ఇవ్వకుండా తానే రుణాలు మంజూరు చేసి, నిధులను లావాదేవీల ద్వారా తన ఖాతాకు మళ్లించుకున్నట్లు తెలుస్తోంది. గత ఏప్రిల్‌లో సహకార సంఘాలను కంప్యూటరీకరణ చేశారు. దీంతో లావాదేవీలన్నీ కంప్యూటర్ ద్వారా నిర్వహించాల్సి ఉంది. అయితే శివగంగ సొసైటీలో లావాదేవీలను మాన్యువల్‌గా చేసినట్లు విచారణ చేసిన అధికారులు గుర్తించినట్లు సమాచారం.
అధికారుల విచారణకు సహకరించని సీఈఓ
సహకార సంఘంలో 2021వ సంవత్సరం నుంచి జరిపిన లావాదేవీల్లో నిధులు కై ంకర్యం చేసినట్లు వచ్చిన సమాచారం మేరకు సహకారశాఖ అధికా రులు 51 నోటీసు ఇచ్చి విచారణ చేపట్టారు. ఈ విచారణలో సంఘంలో సీఈఓ చేసిన లావాదేవీలకు సంబంధించి ధ్రువీకరణ పత్రాలన్నీ సమ ర్పించాల్సి ఉంది. అయితే సీఈఓ వారికి అందు బాటులో లేకుండా ఆ ధ్రువీకరణ పత్రాలన్నీ తన స్వాధీనంలో ఉంచుకుని విచారణకు సహకరిం చటం లేదని సహకారశాఖ అధికారులు చెబుతున్నారు. సొసైటీలో నిధుల కై ంకర్యంలో సుమారు రూ.5 కోట్ల మేర జరిగి ఉంటుందని సొసైటీ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.
నిధుల స్వాహాపై విచారణ చేస్తున్న అధికారి పి.రాము రికార్డుల పరిశీలన అనంతరం తన దృష్టికి వచ్చిన వివరాలతో నివేదిక రూపొందించి డివిజనల్ సహకారశాఖ అధికారి వి.వి.ఫణికుమార్‌కు అందజేసి సొసైటీ సీఈఓ కొల్లూరి రాజేష్‌పై చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేశారు. డీసీఓ కె.చంద్రశేఖరరెడ్డి, కేడీసీసీ బ్యాంకు సీఈఓ ఎ.శ్యామ్‌మనోహర్ మంగళవారం శివగంగ సొసైటీ సీఈఓ కొల్లూరి రాజేష్‌ను సస్పెండ్ చేశారు. సొసైటీ నిధుల విషయంపై సహకారశాఖ అధికారులను ‘సాక్షి’ వివరణ కోరగా తాము విచారణ చేపడుతున్నామని, పూర్తయిన వెంటనే ఎంత నిధులు స్వాహా అయ్యాయో వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.


