సుబ్రహ్మణ్య షష్ఠి కల్యాణోత్సవాలు ప్రారంభం
మోపిదేవి: రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా విరాజిల్లుతున్న మోపిదేవిలోని శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో స్వామి వారి షష్ఠి కల్యాణ మహోత్సవాలు మంగళవారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం ఆలయ కార్యనిర్వహణాధికారి దాసరి శ్రీరామ వర ప్రసాదరావు ఆధ్వర్యంలో వేదపండితుడు కొమ్మూరి ఫణికుమార్ శర్మ, ఆలయ ప్రధానార్చకుడు బుద్దు పవన్‌కుమార్ శర్మ, ఆలయ ఘనాపాటి నౌడూరి సుబ్రహ్మణ్య శర్మ నేతృత్వంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ దంపతులు దేవదాయ ధర్మదాయ శాఖ తరఫున పట్టు వస్త్రాలను స్వామివార్లకు సమర్పించారు. ఆ పట్టు వస్త్రాలతో స్వామివార్లను అందంగా అలంకరించారు. సాయంత్రం యాగశాల ప్రవేశం, విఘ్నేశ్వరపూజ, పుణ్యాహవచనం, రుత్విగ్వరణ, అంకురారోపణ, వాస్తుపూజ, బలిహరణను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పలుగ్రామాల నుంచి భారీగా తరలి వచ్చిన భక్తులు ఈ ఉత్సవంలో పాల్గొని స్వామి వార్లను దర్శించుకున్నారు.
నూతన సంవత్సర కాలెండర్ ఆవిష్కరణ
2026వ సంవత్సర క్యాలెండర్‌ను ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ దంపతులు ఆలయ ప్రాంగణంలో మంగళవారం ఆవిష్కరించారు. ఆలయ ఈఓ దాసరి శ్రీరామ వరప్రసాదరావు, ఆలయ సూపరింటెండెంట్ అచ్యుత మధుసూదనరావు, చెన్నకేశవ, చల్లపల్లి సీఐ ఈశ్వరావు, ఎస్‌ఐ గౌతమ్ కుమార్, ఆలయ అర్చకులు, ఆలయ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.


