నేటి నుంచి సుబ్రహ్మణ్య షష్ఠి కల్యాణోత్సవాలు
మోపిదేవి: మండల కేంద్రమైన మోపిదేవి గ్రామంలో వేంచేసిన శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో సుబ్రహ్మణ్యషష్ఠి కల్యాణ మహోత్సవాలు మంగళవారం నుంచి ఈ నెల 27వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఆలయ ఈఓ దాసరి శ్రీరామవరప్రసాదరావు సోమవారం విలేకరులతో మాట్లాడారు. వైదిక కార్యక్రమాలను అనుసరించి వేద పండితుడు కొమ్మూరు ఫణికుమార్ శర్మ, ఆలయ ప్రధానార్చకుడు బుద్ధు పవన్‌కుమార్ శర్మ బ్రహ్మత్వంలో షష్ఠి కళ్యాణ మహోత్సవాలను శాస్త్రోక్తంగా నిర్వహిస్తామన్నారు. ఈ ఉత్సవాలు ముగిసే వరకు ఆర్జిత సేవలన్నింటిని రద్దుచేశామని తెలిపారు. మంగళవారం ఉదయం 11 గంటలకు స్వామివారిని పెండ్లి కుమారుడిగా అలంకరిస్తామని, రాత్రి ఏడు గంటలకు యాగశాల ప్రవేశం, విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, రుత్విగ్వరణ, అంకురారోపణ, వాస్తుపూజ జరుగుతాయని వివరించారు. ఈ సందర్భంగా ఆలయాని విద్యుత్ దీపాలతో అలంకరించారు.
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): క్రీడా రంగంలో దేశానికీ, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావడంలో మహిళా క్రీడాకారులు ముందంజలో ఉన్నారని శాప్ చైర్మన్ ఎ.రవి నాయుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ సాఫ్ట్ టెన్నిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇందిరాగాంధి మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియం ఆవరణలో అస్మిత ఖేలో ఇండియా సాఫ్ట్ టెన్నిస్ లీగ్ పోటీలను రవి నాయుడు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడారంగంలో మహిళలు రాణించేందుకు ఎన్నో అవకాశాలు ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. శాప్ గుర్తింపు ఉన్న టోర్నమెంట్లలోనే క్రీడాకారులు పాల్గొనాలని చెప్పారు. క్రీడాకారిణులను పరిచయం చేసుకొని, అభినందనలు తెలిపారు. శాప్ బోర్డు సభ్యుడు ఎస్.సంతోష్ కుమార్, డీఎస్‌డీఓ కోటేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ సాఫ్ట్ టెన్నిస్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో సోమ వారం జరిగిన ఖడ్గమాలార్చనలో శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. తెల్లవారుజామున అమ్మవారి ఖడ్గమాలార్చనలో పాల్గొనేందుకు విచ్చేసిన ఆయనకు ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. పూజల అనంతరం వేద పండితులు ఆశీర్వచనం, ఆలయ ఏఈఓ వెంకట రెడ్డి అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, పట్టువస్త్రాలను అందజేశారు. అనంతరం మల్లేశ్వర స్వామిని అయ్యన్నపాత్రుడు దర్శించుకున్నారు.
మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి అభిషేకానికి నాగాయతిప్ప గ్రామానికి చెందిన అయ్యప్పలు పాల కావళ్లతో సోమవారం గ్రామోత్సవం చేశారు. దారి పొడవునా భక్తులు అందించిన పాలు సేకరించి సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి అభిషేకం నిర్వహించారు. బంధుమిత్రులతో పాటు పలువురు అయ్యప్ప మాలధారులు పాల్గొన్నారు.


