రైలు కింద పడి గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): విజయవాడ రైల్వేస్టేషన్ సమీపంలో కదులుతున్న రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై ప్రభుత్వ రైల్వే పోలీసులు (జీఆర్పీ) కేసు నమోదు చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం అర్ధరాత్రి 1.40 గంటల సమయంలో విజయవాడ రైల్వేస్టేషన్ నుంచి విజయవాడ నుంచి కన్యాకుమారి వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలు బయలుదేరింది. ఆ సమయంలో రైల్వేస్టేషన్ దక్షిణ ప్రవేశ ద్వారం, పార్శిల్ కార్యాలయం గేటు వద్ద గుర్తు తెలియని వ్యక్తి రైలుకు ఎదురుగా నిలబడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనలో తీవ్ర రక్తపు గాయాలతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. దీనిపై వచ్చిన సమాచారం మేరకు జీఆర్పీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు నమోదు చేసుకున్నారు. మృతుడి వయసు 40 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉంటుందని, బ్లాక్ కలర్ జీన్స్, వైట్ కలర్ ఫుల్‌హ్యాండ్ షర్ట్ ధరించి ఉన్నాడని, ఇతర ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదని తెలిపారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు విజయవాడ జీఆర్పీ స్టేషన్‌లో సంప్రదించాలని పోలీసులు కోరారు.


