ప్రణాళిక విభాగంతోనే అభివృద్ధి
పటమట(విజయవాడతూర్పు): అభివృద్ధిలో పట్టణ ప్రణాళిక విభాగం కీలకమని, క్షేత్రస్థాయి విధుల నిర్వహణలో అనేక ఒత్తిళ్లు, సవాళ్లను ఎదుర్కొవాల్సి వస్తుందని ఏపీ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ టెక్నికల్ అఫీషియల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు అన్నారు. విజయవాడలో అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సర్వసభ్య సమావేశం ఆదివారం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. టౌన్‌ప్లానింగ్‌కు క్షేత్రస్థాయి సిబ్బంది కొరత ఉందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు భర్తీ కావడం లేదని, పట్టణాల్లో ప్లానింగ్ సెక్రటరీలకు బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్లుగా పదోన్నతులు కలిపిస్తే క్షేత్రస్థాయి సమస్యలు పరిష్కారమవుతాయని పేర్కొన్నారు. సభ్యులకు గ్రూప్ ఇన్సూరెన్స్ చేయాలని సూచించారు. అలాగే గ్రామ/వార్డు సచివాలయ ప్లానింగ్ కార్యదర్శులకు నూతనంగా సర్వీస్ రూల్స్ ఏర్పాటుపై ప్రభుత్వానికి వినతిపత్రాలు ఇవ్వాలని కోరారు. అసోసియేషన్ కార్యదర్శి మోహన్‌బాబు మాట్లాడుతూ.. అసోసియేషన్‌ను మరింత సమర్థంగా నిర్వహించడానికి కృషి చేస్తున్నామని, సభ్యుల సమస్యలపై ప్రభుత్వంతో చర్చించి పరిష్కరిస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ డైరీ రూపకల్పనపై సూచనలు చేశారు. జోనల్ అధ్యక్షుడు వసీంబేగ్, అసోసియేషన్ ఉపాధ్యక్షుడు అబ్దుల్ సత్తార్ తదితరులు పాల్గొన్నారు.


