104 వాహనాల ఉద్యోగుల బకాయిలు చెల్లించాలి
పామర్రు: 104 వాహనాల ఉద్యోగులకు గత కాంట్రాక్ట్ కంపెనీ నుంచి రావాల్సిన గ్రాట్యూటీ, ఈఎల్ బకాయిలను ప్రభుత్వం వెంటనే ఇప్పించాలని ఆంధ్రప్రదేశ్ 104 ఎంఎంయూ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వీఆర్ ఫణికుమార్ డిమాండ్ చేశారు. స్థానిక సీఐటీయూ కార్యాలయంలో ఆదివారం యూనియన్ కృష్ణా జిల్లా బాడీ సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా ఫణికుమార్ పాల్గొని మాట్లాడుతూ.. ప్రస్తుత యాజమాన్యం భవ్య హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కూడా ఇప్పటి వరకు నియామక పత్రాలు, పే స్లిప్పులు ఇవ్వకుండా ఉద్యోగుల మీద తీవ్రమైన ఒత్తిడి తెస్తూ పని చేయించుకుంటోందన్నారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 104 సంస్థలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయడంతో పాటు అదనపు పని భారం తగ్గించాలన్నారు. ఉద్యోగులకు హెల్త్ కార్డులు, జీవో 7 ప్రకారం వేతనాలు, పీఎఫ్, ఈఎస్‌ఐలను సక్రమంగా చెల్లించాలని కోరారు. వాహనాలకు ఇన్సూరెన్సు, ఫిట్‌నెస్‌లు వెంటనే చేయించాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి ఓ గంగాధర్ మాట్లాడుతూ.. కార్మికుల పోరాటాలకు సీఐటీయూ పూర్తి మద్దతు ఇస్తోందన్నారు. డిసెంబర్ 31 నుంచి జనవరి 4 వరకు విశాఖపట్నంలో జరిగే సీఐటీయూ ఆల్ ఇండియా మహాసభను జయప్రదం చేయాలని కోరారు. యూనియన్ జనరల్ సెక్రటరీ డి.విజయ్, యూనియన్ జిల్లా కార్యవర్గ సభ్యులు, 104 సిబ్బంది పాల్గొన్నారు.


