
కాలుష్య రహిత సమాజాన్ని నిర్మించాలి
మచిలీపట్నంటౌన్: ప్రతి ఒక్కరూ అవసరం మేరకే వాహనాలు ఉపయోగించి వాయు, శబ్ద కాలుష్య రహిత సమాజ నిర్మాణం కోసం కృషి చేయాలని కృష్ణా జిల్లా ప్రజలకు కలెక్టర్ డి.కె.బాలాజీ పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా వాయు, శబ్దకాలుష్య రహిత సమాజం నిర్మాణంపై శనివారం ఆయన మచిలీపట్నంలోని జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాల్ నుంచి కోనేరు సెంటర్ మీదుగా మూడు సంభాల సెంటర్ వరకు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు, సిబ్బందితో కలిసి ఆయన సైకిల్ తొక్కుతూ ప్రజలకు శబ్ద, వాయు కాలుష్యంపై అవగాహన కల్పించారు. మూడు స్తంభాల సెంటర్ వద్ద స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమ ప్రతిజ్ఞ చేయించారు. అన్నా క్యాంటీన్‌ను సందర్శించి అల్పాహారం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కుంచె నాని, మునిసిపల్ కమిషనర్ బాపిరాజు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఈఈ శ్రీనివాసరావు, జిల్లా పరిషత్ సీఈఓ కన్నమ నాయుడు, విజిలెన్స్ డెప్యూటీ కలెక్టర్ పోతురాజు, డ్వామా పీడీ ఎన్.వి.శివ ప్రసాద్ యాదవ్, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి ఝాన్సీలక్ష్మి, పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ ఆర్.వెంకట్రావు, విద్యార్థులు పాల్గొన్నారు తొలుత సోలార్ విద్యుత్ (సూర్యఘర్) వాడకంపై అవగాహన ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీలో విద్యుత్ శాఖ టౌన్ ఏడీఈ శ్రీనివాసరావు, రూరల్ ఏడీఈ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ