
చైన్ స్నాచర్ అరెస్ట్
లబ్బీపేట(విజయవాడతూర్పు): మెడపై కత్తి పెట్టి మహిళను బెదిరించి బంగారు వస్తువులు దోచుకెళ్లిన లెనిన్‌నగర్‌కు చెందిన బూరగ గోపీనాథ్(20) అలియాస్ గోపిని సీసీఎస్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. అతని నుంచి రూ.8.32 లక్షలు విలువైన 64 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. క్రైం ఏడీసీపీ ఎం.రాజారావు, ఏసీపీ వెంకటేశ్వర్లు శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ నెల 13న చుట్టుగుంట కాకానినగర్‌లో బిల్డింగ్ మెటీరియల్ షాపు నిర్వహించే బాడిత సత్యవతి వద్దకు ఉదయం వెళ్లి తాను ఏసీ మెకానిక్‌ను అని ఇల్లు అద్దెకు కావాలని అడిగి వెళ్లాడు. తిరిగి అదే రోజు రాత్రి షాపులోకి వచ్చిన గోపీనాథ్, షాపులో సత్యవతి ఒంటరిగా ఉండటంతో షట్టర్ వేసి కత్తి చూపించి మెడలో బంగారు అభరణాలను ఇవ్వాలని, లేకుంటే చంపేస్తానని బెదిరించాడు. ఆమె భయంతో బంగారపు గొలుసు ఇవ్వగా అది తీసుకుని షాప్ షట్టర్ తెరుచుకుని పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, సీపీ ఎస్వీ రాజశేఖరబాబు, క్రైమ్ డీసీపీ తిరుమలేశ్వరరెడ్డి ఆదేశాలతో నగరంలోని పలు పోలీస్‌స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరా విజువల్స్‌ను కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి పరిశీలించారు.
సిబ్బందికి అభినందనలు
ఈ నేపథ్యంలో శనివారం రాజగోపాలచారి వీధిలో ఉన్నట్లు గుర్తించి నిందితుడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి నుంచి చోరీ చేసిన ఆభరణాలను రికవరీ చేశారు. నిందితుడిని పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన ఏఎస్‌ఐ బాలయ్య, బి.వెంకటస్వామి, సత్యనారాయణ, కానిస్టేబుల్ నారాయణలను సీపీ రాజశేఖరబాబు అభినందించారు.

చైన్ స్నాచర్ అరెస్ట్