
రైళ్లలో వేర్వేరు చోరీ కేసుల్లో ఐదుగురి అరెస్ట్
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): రైళ్లు, రైల్వేస్టేషన్లలో ప్రయాణికులను దృష్టి మరల్చి బంగారు ఆభరణాలను చోరీ చేస్తున్న ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు విజయవాడ ప్రభుత్వ రైల్వే పోలీస్ ఇన్‌స్పెక్టర్ జె.వి.రమణ తెలిపారు. విజయవాడ రైల్వేస్టేషన్‌లో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నిందితుల నుంచి రూ.6.10 లక్షల బంగారు ఆభరణాలను స్వాదీనం చేసుకున్నట్లు చెప్పారు.
దృష్టిమరల్చి ఆభరణాల చోరీ..
విజయనగరం, హనుమాన్‌నగర్‌కు చెందిన గుల్లిపల్లి సరస్వతి తన భర్తతో కలసి ఈ నెల 16న విజయవాడ రైల్వేస్టేషన్‌లో దిగారు. ఉదయం 7 గంటల సమయంలో ఆమె ప్లాట్‌ఫాం నంబర్ – 1లోని సులభ కాంప్లెక్స్‌లో స్నానానికి వెళ్తూ బంగారు ఆభరణాలను భర్త తన ఫ్యాంట్ జేబులో ఉంచి భార్యకు అప్పగించి వెళ్లాడు. ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తి ఆమె వద్దకు వచ్చి రెండు పది రూపాయల నోట్లు కిందపడ్డాయి అని చెప్పడంతో ఆమె వాటిని తీసుకునే క్రమంలో మహిళ చేతిలోని ఫ్యాంట్‌ను తీసుకుని పరారయ్యాడు. దీనిపై బాధితురాలు అదే రోజు జీఆర్పీ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, రావులపాలెంకు చెందిన గండ్రోతు సాయినాగలక్ష్మీ మౌనిక ఈ నెల 15న కృష్జార్జునపురం నుంచి రాజమండ్రి వెళ్లేందుకు శేషాద్రి ఎక్స్‌ప్రెస్, ఎస్–4 కోచ్, బెర్త్ నంబర్ – 7లో ప్రయాణిస్తుంది. రైలు రాత్రి 12.15 గంటలకు విజయవాడ చేరుకున్నప్పడు ఆమె నిద్రలోంచి మేల్కోంది. రైలు తిరిగి బయలుదేరి విజయవాడ అవుటర్ సిగ్నల్ పాయింట్ వరకు చేరుకున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఆమె మెడలోని 11 గ్రాముల సాయిబాబా లాకెట్ కలిగిన చైన్‌ను తెంచుకుని నెమ్మదిగా కదులుతున్న రైలు నుంచి దూకి పరారయ్యడు. దీనిపై విజయవాడ జీఆర్పీ సిబ్బంది కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
రెండు కేసుల్లో ఐదుగురు నిందితుల అరెస్ట్..
ఈ రెండు కేసులపై జీఆర్పీ, ఆర్‌పీఎఫ్ ఇన్‌స్పెక్టర్లు జేవీ రమణ, ఫతే ఆలీబేగ్‌లు తమ సిబ్బందితో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అందుబాటులో ఉన్న సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించడంతో పాటుగా పాత నేరస్తులను విచారణ చేయడం ద్వారా నిందితులను గుర్తించారు. ఈ క్రమంలో శనివారం రైల్వేస్టేషన్ మినీస్టేడియం బస్‌స్టేషన్ వద్ద వారు ఉన్నట్లు సమాచారం అందటంతో పోలీసులు దాడిచేసి చిత్తురుజిల్లాకు చెందిన గోగుల జన నరసింహులు, పసుపులేటి సులోచన, పసుపులేటి బాబు, కె.జగన్నాథంలను అదుపులోకి తీసుకుని సులభ కాంప్లెక్స్ వద్ద చోరీ చేసిన రూ.5 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా రైలులో మహిళ మెడలో బంగారు చైన్ స్నాచింగ్ పాల్పడింది ఎన్టీఆర్ జిల్లా మైలవరానికి చెందిన రావూరి సుబ్బారావుగా గుర్తించి గాలింపు చేపట్టారు. నిందితుడు శుక్రవారం ప్లాట్‌ఫాం నంబర్ – 9లో అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకుని అతని వద్ద నుంచి స్నాచింగ్‌కు పాల్పడిన బంగారు చైన్‌ను స్వాధీనం చేసుకున్నారు.