
జియోడిటెక్ అసెట్‌తో కచ్చితమైన మ్యాపులు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): పటాల(మ్యాపుల) తయారీకి, సర్వేకు అత్యంత కీలకమైన స్టాండర్డ్ బెంచ్ మార్కు(ఎస్‌బీఎం)లను సర్వే ఆఫ్ ఇండియా పరిరక్షించడం అభినందనీయమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. కలెక్టరేట్‌లోని 1910 నాటి ఎస్‌బీఎం పునరుద్ధరణ శిలాఫలకాన్ని సర్వే ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల డైరెక్టర్ బీసీ పరిడాతో కలిసి కలెక్టర్ శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ... రాష్ట్రంలో స్టాండర్డ్ బెంచ్ మార్కులు(ఎస్‌బీఎం) 89, బెంచ్ మార్కులు(బీఎం) వేయికి పైగా ఉన్నాయన్నారు. కలెక్టరేట్‌లోని 1910 నాటి స్టాండర్డ్ బెంచ్ మార్కును సర్వే ఆఫ్ ఇండియా మొట్టమొదటిగా పునరుద్ధరించిందని చెప్పారు. ఈ బెంచ్ మార్కుల సహాయంతో అత్యంత కచ్చితత్వంతో(పొజిషన్) స్థానాన్ని చెప్పవచ్చన్నారు. సర్వేకు, మ్యాపుల రూపకల్పనకు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి, శాస్త్ర పరిశోధనకు ఈ బెంచ్ మార్కులు దోహదం చేస్తాయని, విపత్తు నిర్వహణలో వీటి పాత్ర కీలకమని చెప్పారు. మైదాన ప్రాంతాల్లోని బెంచ్ మార్కులే కాక ఎత్తయిన కొండలపై ఉన్న బెంచ్ మార్కులను కూడా సర్వే ఆఫ్ ఇండియా పరిరక్షిస్తుండడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న సర్వే ఆఫ్ ఇండియా తెలుగు రాష్ట్రాల డైరెక్టర్ బీసీ పరిడా మాట్లాడుతూ.. జియోడెటిక్ రిజిస్టర్‌ను రూపొందిస్తున్నామని, ఎన్టీఆర్ జిల్లాలోని బెంచ్ మార్కుల సమాచారంతో కూడిన ఈ రిజిస్టర్‌ను త్వరలో జిల్లా యంత్రాంగానికి అందజేస్తామని చెప్పారు. సర్వేకు, మ్యాపులకు అత్యంత కీలకమైన ఈబెంచ్ మార్కు లు బ్రిటిష్ హయాంలో ఏర్పాటు చేశారని, వీటిని పునరుద్ధరిస్తున్నామన్నారు. దీనికై మూడు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఎస్‌ఎల్‌ఓ వై.మోహన్ రావు, సర్వే ఇన్‌స్పెక్టర్ ఏ.జగన్మోహన్, సర్వే ఆఫ్ ఇండియా ఆఫీసర్లు సమీరుద్దీన్ ఖాన్, పి.నిత్యానందం పాల్గొన్నారు.
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ