కొల్లు స్వార్థం కోసం రోడ్ల విస్తరణ | - | Sakshi
Sakshi News home page

కొల్లు స్వార్థం కోసం రోడ్ల విస్తరణ

Oct 19 2025 6:05 AM | Updated on Oct 19 2025 6:05 AM

కొల్లు స్వార్థం కోసం రోడ్ల విస్తరణ

కొల్లు స్వార్థం కోసం రోడ్ల విస్తరణ

బందరు ప్రజలతో ఆడుకుంటున్న మంత్రి రవీంద్ర

ప్లాన్‌ లేకుండా సొంత భవనాల నిర్మాణ పనులు

చర్యలు తీసుకోని ఎంయూడీఏ, మునిసిపల్‌ అధికారులు

రోడ్ల విస్తరణ నోటిఫికేషన్‌పై న్యాయ పోరాటం చేస్తాం

వైఎస్సార్‌ సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని నాని

తెలుగు తమ్ముళ్ల అక్రమ దందాలు

చిలకలపూడి(మచిలీపట్నం): బందరు ప్రజలతో మంత్రి కొల్లు రవీంద్ర ఆటలాడుతున్నారని, తన స్వార్థం కోసం రోడ్ల విస్తరణకు నోటిఫికేషన్‌ ఇప్పించారని వైఎస్సార్‌ సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) ఆగ్రహం వ్యక్తంచేశారు. మచిలీపట్నంలోని పార్టీ కార్యాలయంలో ఆయన శనివారం సాయంత్రం విలేకరులతో మాట్లాడారు. బెల్లంకొట్ల సందు, సామాస్‌ పక్క సందు విస్తరణ చేస్తామంటూ మునిసిపల్‌ కమిషనర్‌తో ఓ దినపత్రికలో నోటిఫికేషన్‌ ఇప్పించారని పేర్కొన్నారు. కొల్లు రవీంద్ర అక్రమంగా రూ.30 కోట్లతో చేపట్టిన కాంప్లెక్స్‌ నిర్మాణం కోసమే అర్ధంతరంగా ఈ నోటిఫికేషన్‌ ఇచ్చారని విమర్శించారు. కొల్లు రవీంద్ర నిర్మించే భవనం వద్ద తక్కువ, మిగిలిన ఇళ్ల వద్ద ఎక్కువ విస్తరణ జరిగేలా నోటిఫికేషన్‌ ఇచ్చిన వైనాన్ని మ్యాప్‌ ద్వారా వివరించారు. కొల్లు రవీంద్ర నిర్మించే భవనాలు అన్నింటికీ ప్లాన్లు లేవని స్పష్టంచేశారు. ప్లాన్‌ తీసుకునేందుకు రోడ్డు విస్తరణ చేయాల్సి రావటంతో ఈ నోటిఫికేషన్‌ ఇచ్చారని తెలిపారు. తాను 2004లోనే బెల్లంకొట్ల సందును లారీలు రాకపోకలు సాగించేలా విస్తరించామని గుర్తుచేశారు. ప్లాన్‌ లేకుండా రవీంద్ర చేపట్టిన నిర్మాణాలను మునిసిపల్‌, ఎంయూడీఏ అధికారులు పట్టించుకోకుండా నిమ్మకునీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఇప్పటికే బడ్డీకొట్లను తొలగించేసి చిరువ్యాపారులను రోడ్డున పడేశారని, ఇప్పుడు ఈ నోటిఫికేషన్‌తో ఎంతో మంది అమాయకులు నష్టపోతారని ఆవేదన వ్యక్తంచేశారు. కొల్లు రవీంద్ర అండ చూసుకుని మునిసిపల్‌ కమిషనర్‌ విచ్చల విడిగా వ్యవహరిస్తున్నారని, గుమ్మటాల చెరువుపై కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ లెక్క చేయకుండా తెలుగు తమ్ముళ్లు 50, 60 గజాల చొప్పున విక్రయిస్తున్నా పట్టించుకోవడంలేదని విమర్శించారు.

కొల్లు రవీంద్ర కబ్జాలపై హైకోర్టుకు..

మంత్రి కొల్లు రవీంద్ర చేస్తున్న కబ్జాల పర్వం, అక్రమ దందాలపై తాను హైకోర్టుకు, ముఖ్యమంత్రి చంద్రబాబుకు పిటీషన్లు పంపుతానని పేర్ని నాని తెలిపారు. న్యాయపోరాటం చేస్తానన్నారు. పోలీసు లను ఉపయోగించి బలవంతంగా ఆర్యవైశ్యుల ఆస్తు లను లాక్కోవాలని చూస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. కృత్తివెన్నులో 35 ఎకరాల ఆర్యవైశ్యుల ఆస్తు లను కొట్టేసేందుకు ప్రయత్నించి, 200 మంది రౌడీలను పంపి సరుగుడు చెట్లను తొలగించి రూ.కోటికి విక్రయించింది నిజం కాదా అని ప్రశ్నించారు. బాధితుల కుటుంబంపై తప్పుడు కేసులు బనాయించి, అనుచరులతో బెదిరింపులకు పాల్పడ్డారని విమర్శించారు. కొల్లు రవీంద్ర చేస్తున్న కబ్జాలను ఎదుర్కో లేక తనను కొంత మంది ఆశ్రయించారని, వారికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. త్వరలో కొల్లు రవీంద్ర కబ్జాలను ఆధారాలతో వెల్లడిస్తామని పేర్ని నాని ప్రకటించారు. ఈ సమావేశంలో మేయర్‌ చిటికిన వెంకటేశ్వరమ్మ, మాజీ మేయర్‌ మోకా వెంకటేశ్వరమ్మ, డెప్యూటీ మేయర్‌ శీలం భారతి, వైఎస్సార్‌ సీపీ నగర అధ్యక్షుడు మేకల సుధాకర్‌బాబు (సుబ్బన్న), మాజీ డెప్యూటీ మేయర్‌ లంకా సూరిబాబు, కార్పొరేటర్‌ తిరుమలశెట్టి ప్రసాద్‌, నాయకులు చిటికిన నాగేశ్వరరావు, కొక్కిలిగడ్డ శరత్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

మచిలీపట్నంలో ఎవరైనా ఇంటి నిర్మాణానికి పునాది తీసిన వెంటనే టీడీపీ స్థానిక డివిజన్‌ ఇన్‌చార్జిని కలవాలని సచివాలయ సిబ్బందితో చెప్పిస్తున్నారని, అంతస్తుకు రూ.50 వేలు ఇస్తేకానీ పనులు జరిగే పరిస్థితి లేదని పేర్ని నాని పేర్కొన్నారు. మంత్రి చేపట్టిన భవన నిర్మాణానికి సంబంధిత ఇన్‌చార్జ్‌లకు ఎంత చెల్లించారని సూటిగా ప్రశ్నించారు. బడ్డీకొట్లు తొలగించిన మంత్రి టీడీపీ ఇన్‌చార్జ్‌ల సిఫార్సులతో తిరిగి వారి వద్ద రూ.లక్షలు కాజేసి అదే స్థానంలో వారు కొట్లు ఏర్పాటు చేసుకుంటున్న వైనాన్ని ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. ఎంతో మంది కన్నీళ్లతో వైశ్య సామాజిక వర్గానికి చెందిన వారిని బెదిరించి కబ్జా చేసి ఆ స్థలంలో కమర్షియల్‌ కాంప్లెక్స్‌ నిర్మించడం నిజం కాదా అని ప్రశ్నించారు. సాక్షాత్తూ టీడీపీకి చెందిన వారి వద్దే ఎంయూడీఏ చైర్మన్‌ పదవి ఇప్పిస్తానని నమ్మించి రూ.6.70 కోట్లు తీసుకున్నది వాస్తవమా, కాదా చెప్పాలని కొల్లు రవీంద్రను ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement