
కూచిపూడిలో పులకించిన మువ్వలు
కూచిపూడి(మొవ్వ): లెజెండరీ నృత్య కళాకారుడు డాక్టర్ వెంపటి చినసత్యం జయంతిని పురస్కరించుకుని కూచిపూడిలోని శ్రీ సిద్ధేంద్ర యోగి కళావేదికపై శనివారం వరల్డ్ కూచిపూడి డే సెలబ్రేషన్లు జరిగాయి. కళాకారుల నృత్య ప్రదర్శనలతో నాట్యక్షేత్రం పులకించింది. సేవ్ కూచిపూడి ఆర్టిస్ట్ ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, శ్రీ గంగాబాల త్రిపుర సుందరి సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానం సహకారంతో సాగిన నృత్య ప్రదర్శనలు ప్రేక్షకుల కరతాళధ్వనులు అందుకున్నాయి. డాక్టర్ వెంపటి చినసత్యం నృత్య దర్శకత్వంలో ఆయన శిష్య, ప్రశిష్యులు నృత్య ప్రదర్శనలతో వీక్షకులు మైమరిచారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి తరలివచ్చిన 21 మంది గురువుల పర్యవేక్షణలో 150 మందికి పైగా కళాకారులు ప్రదర్శించిన అంశాలు అలరించాయి. కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత, కళారత్న డాక్టర్ వేదాంతం రాధేశ్యాం నట్టువాగం, సూత్రధారిగా కొనసాగిన భామాకలాపం నృత్య రూపం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సత్యభామగా అక్షర దేవెళ్ల, శ్రీ కష్ణుడిగా యశశ్రీ, మాధవిగా డేగల సాంబశివరావు తమ నృత్యాభినయంతో పాత్రలకు జీవం పోసి నృత్యరూపకాన్ని రక్తి కట్టించారు. తొలుత సర్పంచ్ కొండవీటి వెంకట రమణ విజయ లక్ష్మి, ఎంపీడీఓ డి.సుహాసిని, సేవ్ కూచిపూడి ఆర్టిస్ట్ ఫౌండర్ పెద్దప్రోలు భావన, పలువురు నాట్యాచార్యులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాలను ప్రారంభించారు.
నాట్యాచార్యులకు పురస్కారాల ప్రదానం
సేవ్ కూచిపూడి ఆర్టిస్ట్ ఏటా అందించే అవార్డులు, మూడు జీవిత సాఫల్య పురస్కారాలు, ఒక సేవా పురస్కారాన్ని ఈ వేదికపై పెద్దప్రోలు భావన ప్రదానం చేశారు. పద్మభూషణ్ వెంపటి చిన్న సత్యం జీవిత సాఫల్య పురస్కారాన్ని సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ వేదాంతం రాధేశ్యామ్‌కు, పద్మశ్రీ డాక్టర్ శోభానాయుడు జీవిత సాఫల్య పురస్కారాన్ని కూచిపూడి నాట్య పరిశోధన ఆచార్య డాక్టర్ పసుమర్తి శ్రీనివాస శర్మకు, లంక అన్నపూర్ణదేవి జీవిత సాఫల్య పురస్కారాన్ని సీనియర్ నాట్యచార్యుడు గుంటూరు సంధ్యా మూర్తికి, వెంపటి వెంకట్ సేవా పురస్కారాన్ని వి.రమణ కుమారికి అందజేశారు.

కూచిపూడిలో పులకించిన మువ్వలు