
బాణసంచా నిల్వలు, విక్రయాలపై నిఘా
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): బాణసంచా అక్రమ నిల్వలు, అమ్మకాలపై అధికారులు నిరంతరం నిఘా ఉంచాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిల్వలు, అమ్మకాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. దీపావళి పండుగ నేపథ్యంలో బాణసంచా నిల్వలు, అమ్మకాల పర్యవేక్షణపై గురువారం జిల్లా కలెక్టర్ కలెక్టరేట్ నుంచి రెవెన్యూ, పోలీస్, అగ్నిమాపక, విపత్తు నిర్వహణ, మునిసిపల్, వైద్య ఆరోగ్యం, పౌర సరఫరాలు, విద్యుత్ తదితర శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. సమగ్ర తనిఖీల అనంతరం పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో తాత్కాలిక బాణసంచా విక్రయ దుకాణాలకు అనుమతులు మంజూరు చేయాలన్నారు. ఇందుకు రెవెన్యూ, పోలీస్, మునిసిపల్, అగ్నిమాపక, పౌర సరఫరాలు, విద్యుత్ తదితర శాఖల అధికారులతో జాయింట్ ఇన్‌స్పెక్షన్ బృందాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
విజయవాడ పరిధిలో..
విజయవాడలో బాణసంచా దుకాణాల ఏర్పాటుకు అవసరమైన మైదానాలను సిద్ధం చేయాలని కలెక్టర్ సూచించారు. పట్టణ ప్రాంతాల్లో టౌన్ ప్లానింగ్ అధికారుల నివేదికలకు అనుగుణంగా ప్రాంతాలను గుర్తించాలన్నారు. బాణసంచా విక్రయించేందుకు సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ నుంచి ముందుగానే దుకాణదారులు తప్పనిసరిగా లైసెన్సు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. గతంలో బాణసంచా విక్రయాలు జరిగిన జింఖానా మైదానంలో భద్రతాపరమైన లోపాల వల్ల అగ్నిప్రమాదం సంభవించి, ఇద్దరు మృతి చెందిన విషయాన్ని గుర్తు చేశారు. అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఆ సిఫార్సులను కచ్చితంగా పాటించాలి
ఏకసభ్య విచారణ కమిటీ చేసిన 23 సిఫార్సులను కచ్చితంగా పాటించేలా చూడాలని ఆదేశించారు. ఒక్కో దుకాణానికి మధ్య మూడు మీటర్ల దూరం ఉండాలన్నారు. దుకాణాలు ఎదురెదురుగా ఉండకుండా చూడాలన్నారు. రెసిడెన్షియల్ ఏరియాకు కనీసం 50 మీటర్ల దూరంలో దుకాణాలకు అనుమతివ్వాలని స్పష్టం చేశారు. ఒక క్లస్టర్‌లో 50కి మించి దుకాణాలకు అనుమతివ్వకూడదన్నారు. సమావేశంలో విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర, ఆర్‌ఓ ఎం. లక్ష్మి నరసింహం, డీసీపీ కేజీవీ సరిత, అగ్నిమాపక అధికారి శంకర్‌రావు, వీఎంసీ అగ్నిమాపక అధికారి నరేష్ తదితరులు పాల్గొన్నారు.
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ