హాస్టల్‌ విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టండి | - | Sakshi
Sakshi News home page

హాస్టల్‌ విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టండి

Oct 10 2025 6:40 AM | Updated on Oct 10 2025 6:40 AM

హాస్టల్‌ విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టండి

హాస్టల్‌ విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టండి

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమిస్తున్నామని, వారు విద్యార్థుల సంక్షేమ, విద్య, ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ జి.లక్ష్మీశ ఆదేశించారు. జిల్లాలోని సాంఘిక సంక్షేమ, వెనుకబడిన తరగతులు, గిరిజన సంక్షేమ, గురుకుల వసతి గృహాల నిర్వహణపై జిల్లా సంక్షేమ అధికారులు, సహాయ సంక్షేమ అధికారులు, వసతి గృహ సంక్షేమ అధికారులతో కలెక్టర్‌ గురువారం రైతు శిక్షణ కేంద్రం సమావేశ మందిరంలో సమీక్ష జరిపారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో 34 సాంఘిక సంక్షేమ, 26 వెనుకబడిన తరగతులు, మూడు గిరిజన సంక్షేమ, రెండు మైనార్టీ సంక్షేమ వసతి గృహాల పర్యవేక్షణకు జిల్లా స్థాయి అధికారులను ప్రత్యేక అధికారులను నియమించామన్నారు. వసతి గృహ విద్యార్థుల భవిష్యత్‌ సంక్షేమ అధికారులపై ఉందన్నారు. చిన్నతనంలో తాను కూడా హాస్టల్‌లో ఉండి చదువుకుని ఈ స్థాయికి వచ్చానన్నారు. ప్రత్యేక అధికారులు వారానికి ఒక రోజు హాస్టళ్లను సందర్శించా లని, నిర్వహణలో ఏవైనా లోపాలను గుర్తిస్తే సరిచేసేందుకు కృషి చేయాలని సూచించారు. ముఖ్యంగా విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, కాచి చల్లార్చిన నీటిని తాగేలా చూడా లని పేర్కొన్నారు. విద్యార్థులకు ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు నిర్వహించాలని, ప్రతి ఒక్కరికీ కేర్‌ షీట్‌ నిర్వహించాలని స్పష్టంచేశారు. హాస్టళ్లకు సరఫరా చేసే మినరల్‌ వాటర్‌ ప్లాంట్లను, నీటిని ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలన్నారు. ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లు హాస్టళ్లలో ఆహారాన్ని తనిఖీ చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రత్యేక అధికారులు విద్యార్థులు, తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించాలన్నారు. ప్రతి వసతి గృహంలో ఏటీఎం కిచెన్‌ గార్డెన్‌ నిర్వహించాలన్నారు. ఈ సమా వేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం.లక్ష్మీనర సింహం, జిల్లా సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ అధికారి ఎం.రమాదేవి, మైనార్టీ సంక్షేమ అధికారి అబ్దుల్‌ రబ్బాని, గురుకుల విద్యాలయ సంక్షేమ అధికారి ఎ.మురళీకృష్ణ, వెనకబడిన సంక్షేమ అధికారి కె.లక్ష్మీదేవి, సహాయ సంక్షేమ అధికా రులు వి.గణేష్‌, టి.గాయత్రి, ఎం.ఇజ్రాయిల్‌, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ లక్ష్మీశ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement