ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మకు ఈ నెల 23వ తేదీన గాజుల ఉత్సవం నిర్వహించనున్నారు. కార్తిక శుద్ధ విదియ, భగిని హస్త భోజనం, యమ ద్వితీయను పురస్కరించుకుని అమ్మవారి ప్రధాన ఆలయంలో మూలవిరాట్, మహామండపం ఆరో అంతస్తులో ఉత్సవ మూర్తిని, ఆలయ ప్రాంగణాన్ని రంగురంగుల గాజులతో అందంగా ముస్తాబు చేయనున్నారు. ఈ మేరకు ఆలయ వైదిక కమిటీ ఉత్సవానికి సంబంధించిన అంశాలపై గురువారం సమావేశమైంది. తెల్లవారుజామున అమ్మవారికి గాజు లతో విశేష అలంకరణ, పూజా కార్యక్రమాల అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. అమ్మవారి ఆలయ అలంకరణకు అవసరమైన గాజులను భక్తులు, దాతల నుంచి సేకరించాలని దేవస్థానం నిర్ణయించింది. అమ్మవారికి వివిధ వర్ణాల గాజులను అలంకరణ నిమిత్తం వినియోగిస్తున్నారు. గాజులను దాతలు ఆలయ ప్రాంగణంలోని డోనేషన్ కౌంటర్‌లో సమర్పించొచ్చని ఆలయ అధికారులు పేర్కొన్నారు. ఉత్సవం అనంతరం అమ్మవారికి, ఆలయాన్ని అలంక రించిన గాజులను క్యూ లైన్లలో భక్తులకు పంపిణీ చేస్తారు.
20న దీపాలంకరణ
ఈ నెల 20వ తేదీన దీపావళి పర్వదినం సందర్భంగా అమ్మవారి ప్రధాన ఆలయంలో పంచహారతుల సేవ అనంతరం ధనలక్ష్మీ పూజ, దీపాలంకరణ జరుగుతాయి. అంతరాలయంలోని అమ్మవారి ప్రధాన మూర్తి వద్ద ఆలయ అర్చకులు ధనలక్ష్మి పూజ నిర్వహిస్తారు. అనంతరం ఆలయ ప్రాంగ ణంలో బాణసంచా వెలిగిస్తారు. అనంతరం ఏడు గంటలకు శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల ఆలయాలతో పాటు ఇతర ఉపాలయాలకు కవాట బంధనం జరుగుతుంది.