
సీజేఐపై దాడి రాజ్యాంగానికి మాయని మచ్చ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్‌పై దాడి రాజ్యాంగానికి మాయని మచ్చ అని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ అన్నారు. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సీజేఐ తన ధర్మాసనంలో కూర్చుని ఉండగా, ఒక అడ్వకేట్ చెప్పు తీసి విసిరేశాడని ఇది అత్యంత అమానుషమని అన్నారు. ఎన్డీఏ పాలనలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిపై చెప్పు విసరడం నేటి పరిస్థితులకు తార్కాణమన్నారు. ప్రధాన న్యాయమూర్తి పరిస్థితే ఇలా ఉంటే, గ్రామాల్లో దళితుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వ పాలన అతి భయంకరంగా ఉందన్నారు. దళితులు కన్నీరు పెడుతున్నారని పేర్కొన్నారు. ఎప్పుడూ రోడ్లపైకి రాని దళితులు నేడు వీధుల్లోకి రావాల్సిన పరిస్థితులను కూటమి ప్రభుత్వం కల్పించిందని విమర్శించారు. ఏపీకి చెందిన ఒక డీజీపీ స్థాయి పోలీస్ ఆఫీసర్ హరియాణాలో తన రివాల్వర్‌తో కాల్చుకుని చనిపోయారని, ఆయన తొమ్మిది పేజీల నోట్‌లో ఆ రాష్ట్ర ప్రభుత్వం గురించి రాశా రని పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వ పాలనలో దళిత ఆఫీసర్లు, దళిత ఉద్యోగస్తులు పరిస్థితి చాలా దారుణంగా ఉందన్నారు. ఏపీలో రైతులు చాలా ఆందోళనతో ఉన్నారని, చివరికి పండించిన ధాన్యాన్ని విక్రయించలేని పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తంచేశారు. మిల్లర్లు లాభ పడ్డారని, రైతులు అప్పుల్లో, కష్టాల్లో కూరుకుపోయారని వివరించారు. బీజేపీ తన ఎన్నికల వాగ్దానాలను నిలబెట్టుకోలేదని ఆరోపించారు. రెండు కోట్ల ఉద్యోగాలు, పేదల ఖాతాల్లో రూ.15 లక్షల చొప్పున జమ హామీలు అమలుకు నోచుకోలేదని పేర్కొన్నారు.
కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్