
ప్లాస్టిక్ నియంత్రణకు పాటుపడండి
కోనేరుసెంటర్(మచిలీపట్నం): ప్లాస్టిక్ నియంత్రణలో ప్రజలంతా భాగస్వాములు కావాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ప్రజలకు పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర, అంతర్జాతీయ తీర ప్రాంత పరిశుభ్రత దినోత్సవంలో భాగంగా పర్యావరణం కోసం జీవనశైలి.. సేవా పర్వ్–2025’ పేరుతో కార్యక్రమాలను నిర్వహించారు. అందులో భాగంగా శనివారం ఆయన కార్యాలయ సిబ్బందితో కలిసి నగరంలోని కలెక్టరేట్ ప్రాంగణం నుంచి మంగినపూడి బీచ్ వరకు జరిగిన సైకిల్ ర్యాలీలో పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల మూడో శనివారం స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఈనెల 17వ తేదీ నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు స్వచ్ఛతాహి సేవ కార్యక్రమాలను జరుగుతుందని చెప్పారు.
విజేతలకు జ్ఞాపికలు అందజేత..
కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛత గురించి అవగాహన కల్పిస్తూ మంగినపూడి బీచ్‌లో తీరప్రాంత పరిశుభ్రత దినోత్సవంగా పాటిస్తున్నామని చెప్పారు. అనంతరం పాఠశాల విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణపై నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ, చిత్రలేఖనం పోటీల విజేతలకు జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలను కలెక్టర్ అందజేసి అభినందించారు. అనంతరం బీచ్‌లో చెత్తాచెదారాన్ని కలెక్టర్ తదితరులు శుభ్రం చేశారు. కార్యక్రమంలో కేంద్ర పర్యావరణ శాఖ సెక్షన్ అధికారి అశోక్ కుమార్, మున్సిపల్ కమిషనర్ బాపిరాజు, సహాయ కమిషనర్ గోపాలరావు, కాలుష్య నియంత్రణ మండలి ఈఈ శ్రీనివాస్, జిల్లా పర్యాటక అధికారి రామ్ లక్ష్మణ్, డీఎస్డీవో ఝాన్సీ లక్ష్మి, సమాచార పౌర సంబంధాల శాఖ డీడీ వెంకటేశ్వరప్రసాద్, వివిధ విభాగాల అధికారులు, ఆక్వా ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొన్నారు.