
సర్వదర్శనం క్యూలైన్‌లో అధికారుల దర్శనం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దసరా ఉత్సవాల ఏర్పాట్ల పరిశీలనలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, అధికార బృందం శనివారం సాయంత్రం సర్వదర్శనం క్యూలైన్‌లో ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకున్నారు. తొలుత కెనాల్‌రోడ్డులోని రథం సెంటర్ వద్ద క్యూలైన్ పనులను పరిశీలించారు. కలెక్టర్ లక్ష్మీశతో పాటు జేసీ ఇలక్కియ, ఆర్డీవోలు కె.చైతన్య, కె.బాలకృష్ణ, కె.మాధురి, డీఆర్వో లక్ష్మీ నరసింహం, ఇతర అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. వినాయకుడి గుడి నుంచి క్యూలైన్‌లో నడక మార్గం ద్వారా కొండపైకి చేరుకున్నారు. మార్గ మధ్యలో చైనావాల్ వద్ద నుంచి కృష్ణానదిని, ఓం టర్నింగ్ వద్ద నగర అందాలను కలెక్టర్ బృందం వీక్షించింది. ఉచిత క్యూలైన్లలో ఏర్పాటు చేసిన మంచినీటి కుళాయిల వద్ద కొత్త గ్లాసులను ఏర్పాటు చేయాలని, అదే విధంగా సింక్‌లను యాసిడ్‌తో శుభ్రం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. లక్ష్మీగణపతి ప్రాంగణంలో గోవులను తరలించిన ప్రదేశాన్ని శుభ్రం చేయకుండా వదిలేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌంటర్లలో పోస్టర్లు చినిగి ఉండటంతో వారిని వెంటనే సరి చేయాలన్నారు. క్యూలైన్లలో కొన్ని చోట్ల ఎత్తు పల్లాలుగా ఉందని, దీని వల్ల భక్తులు ఇబ్బందులకు గురవుతారని పేర్కొన్నారు. సర్వదర్శనం క్యూలైన్‌లో ధ్వజస్తంభానికి మొక్కిన అనంతరం అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో చేపట్టాల్సిన మార్పులను అక్కడ ఉన్న సిబ్బందికి వారు సూచనలు చేశారు.
నందిగామటౌన్: వరి పొలంలో మోటార్ ఆన్ చేసేందుకు వెళ్లి అనుమానాస్పద స్థితిలో రైతు మృతి చెందిన ఘటన శనివారం చోటుచేసుకుంది. సేకరించిన సమాచారం మేరకు పట్టణ శివారు అనాసాగరానికి చెందిన రైతు కొమ్మినీడి నాగేశ్వరరావు(57) రోజూ మాదిరిగానే శనివారం మధ్యాహ్నం వరి పంటకు నీళ్లు పెట్టేందుకు వెళ్లాడు. మోటార్ స్విచ్ ఆన్ చేయడానికి వెళ్లిన రైతు పక్కనే ఉన్న పంట పొలంలో పడిపోవడం చూసిన సమీపంలోని రైతులు, వ్యవసాయ కూలీలు హుటాహుటిన నందిగామలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న విద్యుత్ శాఖ ఏఈ నాగేశ్వరరావు ఘటనా స్థలాన్ని పరిశీలించి విద్యుత్ షాక్‌తో మృతి చెందిన ఆనవాళ్లు లేవని చెప్పినట్లు సమాచారం. విద్యుత్ షాక్‌తో మృతి చెందాడా లేక వేరే కారణాలున్నాయా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు.

సర్వదర్శనం క్యూలైన్‌లో అధికారుల దర్శనం