
సామాన్య భక్తులకు దుర్గమ్మ దర్శన భాగ్యం కల్పించాలి
భవానీపురం(విజయవాడపశ్చిమ): సామాన్య భక్తులకు సంతృప్తికరంగా దుర్గమ్మ దర్శన భాగ్యం కల్పించడం మన బాధ్యతని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ, పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్ బాబు అధికార యంత్రాంగానికి ఆదేశాలిచ్చారు. దసరా మహోత్సవాల విధుల నిర్వహణపై శనివారం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో వారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా దిశనిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. నగరంలోని ప్రతి సెక్టార్‌లో జిల్లా అధికారులు, రెవెన్యూ, పోలీస్, అగ్నిమాపక, వైద్య ఆరోగ్యం, వీఎంసీ శాఖల సిబ్బంది మూడు షిప్టులలో విధులు నిర్వర్తిస్తారన్నారు. ఆయా సెక్టార్లలో ఎలాంటి ఇబ్బంది వచ్చినా తక్షణమే స్పందించి కమాండ్ కంట్రోల్ కేంద్రానికి సమాచారం ఇవ్వాలని, యుద్ధప్రాతిపదికను సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని చెప్పారు. ఐదు నిముషాల ముందే డ్యూటీ పాయింట్‌కు చేరుకుని ముందు షిఫ్ట్ ఆఫీసర్‌ను రిలీవ్ చేయాలన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అమ్మవారి దర్శనం లభించేలా అందుబాటులో ఉన్న అన్ని వనరులను ఉపయోగించుకోవాలని చెప్పారు.
సమష్టిగా పనిచేయాలి..
మొత్తం 36 సెక్టార్ల బాధ్యతలు చూస్తున్న ఇన్‌చార్జ్‌లు, సిబ్బంది కలిసి భక్తుల భద్రత, సురక్షిత మంచినీరు. శుభ్రమైన ఆహారం, అహ్లాదకర పరిసరాలు, సురక్షిత క్యూ లైన్లు, మహిళలు, చిన్నారుల భద్రత, సూచిక బోర్డులు, సమాచార బోర్డులు, పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ వంటి అంశాలపై దృష్టి సారించాలని కలెక్టర్ లక్ష్మీశ ఆదేశించారు. ఎప్పటికప్పుడు భక్తులతో మాట్లాడి సౌకర్యాలపై ఫీడ్ బ్యాక్ తీసుకోవాలన్నారు. భక్తుల క్షేమం, భద్రతపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సీపీ ఎస్వీ రాజశేఖరబాబు పలు సూచనలు చేశారు. అందరూ సమష్టిగా పనిచేయాలని సూచించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర, డీఆర్‌ఓ ఎం.లక్ష్మీనరసింహం, ఆర్డీవోలు కావూరి చైతన్య, కె.బాలకృష్ణ, కె.మాధురి పాల్గొన్నారు.
కలెక్టర్ లక్ష్మీశ, సీపీ రాజశేఖరబాబు