
పెన్షన్ వ్యాలిడేషన్ క్లాజ్ రద్దుకు డిమాండ్
మధురానగర్(విజయవాడసెంట్రల్): కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆమోదించిన పెన్షన్ వ్యాలిడేషన్ క్లాజ్‌ను వెంటనే రద్దు చేయాలని ఫోరమ్ ఆఫ్ సివిల్ పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వి.వరప్రసాద్, కన్వీనర్ ఎన్.రామారావు డిమాండ్ చేశారు. స్థానిక చుట్టుగుంట బీఎస్‌ఎన్‌ఎల్ భవన్‌లో శనివారం ఫోరమ్ ఆఫ్ సివిల్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన పెన్షన్ వ్యాలిడేషన్ క్లాజ్ వల్ల కేంద్ర ప్రభుత్వ పెన్షనర్స్‌ను పాత, కొత్త పెన్షనర్స్‌గా విడగొట్టి.. వేతన సవరణ జరిగితే కేవలం కొత్త పెన్షనర్స్‌కు మాత్రమే వేతన సవరణ జరుగుతుందన్నారు. దీనివల్ల పాత పెన్షనర్స్‌కు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఆంధ్రప్రదేశ్‌లో అన్ని సంఘాలు కలిసి అసోసియేషన్‌గా ఏర్పడి పెన్షన్ వ్యాలిడేషన్ రద్దు చేయాలని దశలవారీ పోరాటం చేస్తున్నామన్నారు. 8వ పే కమిషన్‌కు చైర్మన్, సభ్యులను నియమించాలి సుప్రీంకోర్టు నకారా వర్సెన్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో పెన్షనర్లందరూ సమానం అని తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తాము వచ్చే నెల 10వ తేదీన దేశవ్యాప్తంగా అన్ని యూనియన్ల పెన్షనర్స్ చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. 8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం జనవరిలోనే ప్రకటించినప్పటికీ ఇంత వరకు సంఘానికి కనీసం చైర్మన్, సభ్యులను విధి విధానాలను ఏర్పాటు చేయలేదన్నారు. దీని వల్ల ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో అసోసియేషన్ రాష్ట్ర నాయకులు ఎన్.నాగేశ్వరరావు, ఎ.చంద్రశేఖర్, కోటేశ్వరరావు, ఎంఆర్‌ఎస్ ప్రకాశరావు, వీకే ప్రసాదరెడ్డి, శివరావు, ఎస్.జమిలిరెడ్డి తదితరులు పాల్గొని మాట్లాడారు.