
నామినేటెడ్ పదవుల్లో సముచిత స్థానం కల్పించాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్రంలోని కాపులకు నామినేటెడ్ పదవుల్లోనూ, స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ తగిన ప్రాధాన్యత ఇవ్వాలని కాపు రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు చల్లమల్ల ప్రసాదరావు డిమాండ్ చేశారు. కృష్ణాజిల్లాకు వంగవీటి మోహన రంగా పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. గాంధీనగర్‌లోని ఐలాపురం హోటల్‌లో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాపులకు రాజకీయ ప్రాధాన్యత కల్పించని పక్షంలో వచ్చే ఎన్నికల్లో తమ సత్తా చూపిస్తామని హెచ్చరించారు. జేఏసీ నేతలు అమ్మ శ్రీనివాస్ రావు, చందు భవన్నారాయణ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి కాపులకు అన్యాయం జరుగుతూనే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం కాపులను వాడుకుంటున్నారని, ఎన్నికల తర్వాత కూరలో కరేపాకుల విసిరేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు 95 శాతం ప్రజలు కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేసి గెలిపించారని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాపులకు 12 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. జనసేన ఎమ్మెల్యేలు, మంత్రులు నామినేటెడ్ పదవుల విషయంలో కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. సమావేశంలో కాపు జేఏసీ నేతలు జానపాముల నాగబాబు, కర్రి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
కాపు రిజర్వేషన్ పోరాట సమితి