
కృష్ణానదిలో యువకుడు గల్లంతు
గాలింపు చర్యలు చేపట్టిన ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు
కోడూరు: బహిర్భూమికి వెళ్లిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తూ కృష్ణానదిలో పడి గల్లంతైన ఘటన కోడూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ చాణిక్య సోమవారం తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని లింగారెడ్డిపాలెం గ్రామానికి చెందిన కంతేటి నాగవెంకట శ్రీనివాసరావు (28) ఆదివారం సాయంత్రం తన భార్యను కోడూరులోని ఓ ప్రైవేట ఆసుపత్రికి తీసుకువచ్చాడు. ఆ సమయంలో శ్రీనివాసరావు ఉల్లిపాలెం సమీపంలోని కృష్ణా నది వద్దకు వెళ్తున్నట్లు తన తండ్రి నాగబసవయ్యకు చెప్పి వెళ్లాడు. అయితే రెండు గంటలు దాటినా కూడా శ్రీనివాసరావు రాకపోవడంతో తండ్రి నాగబసవయ్య బంధువులతో కలిసి ఉల్లిపాలెం వారధి వద్దకు వెళ్లాడు. శ్రీనివాసరావు బైక్, చెప్పులు ఉల్లిపాలెం వారధిపై ఉండడాన్ని గమనించారు. కిందకి చూడగా.. నదిలో పడి కొట్టుకుపోతున్నట్లు గమనించి, కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది.
ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలతో గాలింపు..
ఉల్లిపాలెం వద్ద కృష్ణానదిలో గల్లంతైన శ్రీనివాసరావు కోసం పోలీసులు ముమ్మర గాలింపు చేపట్టారు. స్థానిక మత్స్యకారులు, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాల సహకారంతో నదిలో బోట్లపై గాలింపు జరిపారు. నాలుగు బృందాలుగా విడిపోయి ఉల్లిపాలెం నుంచి హంసలదీవి వరకు నదిని జల్లెడ పట్టారు. సముద్ర పోటుతో పాటు వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో శ్రీనివాసరావు ఆచూకీ సోమవారం సాయంత్రం వరకు కూడా దొరకలేదని ఎస్‌ఐ చెప్పారు. మంగళవారం గాలింపు చర్యలు కొనసాగుతాయన్నారు.