జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ ఆదేశం జిల్లాస్థాయి పీజీఆర్‌ఎస్‌కు 168 అర్జీలు
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)కు ప్రజల నుంచి వచ్చే ప్రతి అర్జీపైనా ప్రత్యేక దృష్టి పెట్టి, ప్రజల సమస్యలకు నాణ్యమైన పరిష్కారం చూపాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ అన్నారు. కలెక్టరేట్‌లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో సోమవారం పీజీఆర్‌ఎస్ కార్యక్రమం జరిగింది. జేసీ ఎస్.ఇలక్కియ అధికారులతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పీజీఆర్‌ఎస్‌లో అర్జీ ఇస్తే తప్పనిసరిగా తమ సమస్యకు ఓ పరిష్కారం లభిస్తుందనే ఆశతో ప్రజలు వస్తారని, అధికారులు నిబద్ధతతో అర్జీలపై దృష్టి పెట్టి పారదర్శకంగా సమస్యలు పరిష్కరించాలన్నారు. నిర్దేశ గడువులోగా అర్జీదారుడు సంతృప్తి చెందేలా సమస్యను పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో డీఆర్‌వో ఎం.లక్ష్మీనరసింహం, గ్రామ, వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి జి.జ్యోతి, కేఆర్‌సీసీ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ కె.పోసిబాబు తదితరులు పాల్గొన్నారు. జిల్లా స్థాయి పీజీఆర్‌ఎస్‌కు 168 అర్జీలు జిల్లా స్థాయిలో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో 168 అర్జీలు వచ్చాయన్నారు. వీటిలో రెవెన్యూ శాఖకు సంబంధించి 44, పోలీస్ 26, డీఆర్‌డీఏకు 17, ఎంఏయూడీ 16, విద్య 9, పంచాయతీరాజ్ శాఖకు 8 అర్జీలు వచ్చాయి. ఆరోగ్యం, గృహ నిర్మాణం, విభిన్న ప్రతిభావంతుల శాఖకు సంబంధించి నాలుగు చొప్పున, ఇరిగేషన్, కాలేజీ విద్య, పౌర సరఫరాలు, వ్యవసాయం, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్‌కు సంబంధించి మూడు చొప్పున, సర్వే, సహకారం, సాంఘిక సంక్షేమం, కాలుష్య నియంత్రణ, విద్యుత్, ఎండోమెంట్స్ శాఖలకు సంబంధించి రెండు చొప్పున అర్జీలు వచ్చాయి. మైన్స్, నైపుణ్యాభివద్ధి, బీసీ సంక్షేమం, ఉపాధి కల్పన, పర్యాటకం, గ్రామీణ నీటి సరఫరా, బ్యాంకు సేవలు, సాంకేతిక విద్య, గ్రామ–వార్డు సచివాలయాల శాఖలకు సంబంధించి ఒక్కో అర్జీ వచ్చాయి. మొత్తం 168 అర్జీలు రాగా వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జేసీ ఆదేశించారు.