
సాక్షి ప్రతినిధి, విజయవాడ: గొల్లపూడిలోని మచిలీపట్నం గొడుగుపేట వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించిన భూమిలో విజయవాడ ఉత్సవ్ మాటున ఎటువంటి అనుమతులు లేకుండా మట్టి తోలి చదును చేయడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ‘సాక్షి’ లో వరుస కథనాలు రావడంతో ఉత్సవాల వెనుక ఉన్న టీడీపీ నాయకులు, అధికారులు తడబడ్డారు. సీఎం కార్యాలయం సైతం జిల్లా యంత్రాంగంతో ఆరా తీసి, పనులు నిలిపివేయాలని ఆదేశించింది.దీంతో ఈ ఉత్సవాల మాటున దేవుని మాన్యంకు ఎసరు పెట్టి, భారీ ప్రణాళిక రచించిన పార్లమెంట్ ముఖ్యనేతతో కూడిన ఐదుగురి బృందంకు ఎటూ పాలు పోలేదు. ఈ ఉత్సవాలు జరపకపోతే తమ పరువు పోతుందని, తాత్కాలికంగా లీజుకు ఇప్పించాలని ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న యువనేత వద్ద గోడు వెళ్లబోసుకున్నట్లు టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దేవుని మాన్యం భూమిలో ఉత్సవాలు జరిపేందుకు నిబంధనలు ఒప్పుకోవని, ఇప్పటికే లీజు ఉండటంతో, ఆ లీజు రద్దు చేస్తే తప్ప వీలు కాదని తేల్చారు. దీంతో రంగంలోకి దిగిన పార్లమెంటు ముఖ్యనేత, నియోజక వర్గ నేత లీజుదారులను ఎలాగోలా ఒప్పించారు. ఆలయ కమిటీ సభ్యులనుంచి నిరసన రాకుండా ఆగమేఘాల మీద టీడీపీ పెద్దలంతా మచిలీపట్నం వెళ్లి రూ.45 లక్షల చెక్కును అందజేయటం వెనుక భారీ కుట్ర దాగి ఉందని టీడీపీ వర్గాలే అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.
ఈ ప్రశ్నలకు బదులేది?
● రూ.400 కోట్ల విలువైన 39.99 ఎకరాల భూమిలో వరల్డ్ క్లాస్ గోల్ఫ్ ప్రాక్టీస్ రేంజ్ అండ్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ పేరుతో 5 ఎకరాలు, ఏటా విజయవాడ ఉత్సవాల పేరుతో ట్రేడ్ ఎక్స్‌పో, సాంస్కృతిక కార్య క్రమాలు, ఎస్‌హెచ్‌జీ మేళా, అగ్రిటెక్ షోకేసు, టూరిజం ప్రమోషన్ ఈవెంట్లతో ఎగ్జిబిషన్ నియమించేందుకు శాశ్వత వేదిక నిర్మించడం పేరుతో మరో 34.99 ఎకరాల భూమి లీజు కోసం ప్రతిపాదనలు జిల్లా యంత్రాంగం నుంచి దేవదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి వెళ్లాయి. ఆ ప్రతిపాదనల వెనుక మర్మం ఏంటని టీడీపీ నేతలే ప్రశ్నిస్తున్నారు.
● ఈ ప్రతిపాదన పెండింగ్‌లో ఉండగానే ఈనెల మొదటి వారంలోనే దేవుని మాన్యం భూమిలో దేవదాయ శాఖ నుంచి ఎలాంటి అనుమతి లేకుండా, పంటలు పండే పొలంలో 4 నుంచి 6 అడుగుల మేర మట్టి తోలి చదును ఎలా చేశారని ప్రశ్నిస్తున్నారు. మట్టి ఎక్కడ నుంచి తెచ్చారు. దానికి మైనింగ్ శాఖ నుంచి అనుమతులు ఉన్నాయా, దేవస్థానం భూమిలో అక్రమంగా మట్టి తోలుతుంటే స్థానిక రెవెన్యూ అధికారులు ఏం చేశారనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది.
● ఇదిలా ఉంటే సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ పేరుతో 30 ఎకరాలకు రూ.45 లక్షల లీజు మొత్తం తీసుకుని దేవదాయశాఖ లీజు ఇస్తూ ఈ నెల 13న మెమో ఇవ్వడం గమనార్హం. ఈ భూములను శాశ్వతంగా కొట్టేసేందుకు భారీ వ్యూహం రచించినట్లు టీడీపీ వర్గాల్లోనే చర్చ సాగుతోంది.
● 56 రోజుల తరువాత ఆ మట్టి ఎవరు తొలగిస్తారని, దానిని మళ్లీ పంట పొలంగా మార్చాలంటే ఎంత కష్టమని భక్తులు అంటున్నారు. మళ్లీ ఆ భూమి వ్యవసాయానికి పనికి వస్తుందా అనే చర్చ సాగుతోంది. ఆలయ భూముల్లో విజయవాడ ఉత్సవ్ నిర్వహణకు ఓ ప్రైవేటు సంస్థ ఈ స్థలాన్ని తీసుకోవడం, అందునా టీడీపీ నాయకులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పైగా విజయవాడ నగరంలో ఎన్నో స్థలాలు ఉన్నా లక్షలాది రూపాయలను ఖర్చు చేసి ఆలయ భూముల్ని తీసుకోవడంలోని ఆంతర్యం ఏమిటని భక్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కేవలం 56 రోజుల ఉత్సవాల కోసం పంటలు పండే వ్యవసాయ భూమిని చెర పట్టి, కోట్ల విలువైన మట్టిని 4 నుంచి 6 అడుగుల మేర తోలి చదును చేయడం ఏంటని భక్తులు పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.