
అమ్మవారిని దర్శించుకున్న కలెక్టర్ దంపతులు
భవానీపురం(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారిని కలెక్టర్ దంపతులు దర్శించుకున్నారు. నూతనంగా నెల్లూరు జిల్లా కలెక్టర్‌గా హిమాన్షు శుక్లా, పల్నాడు జిల్లా కలెక్టర్‌గా కృతికశుక్లా నియమితులైన నేపథ్యంలో శుక్రవారం వారు కుటుంబసభ్యులతో కలిసి శ్రీదుర్గామల్లేశ్వరస్వామివార్ల దేవస్థానానికి విచ్చేశారు. వారికి ఆలయ కార్యనిర్వహణాధికారి వీకే శీనానాయక్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం వారి కుటుంబానికి అమ్మవారి దర్శనం కల్పించి, వేద పండితులతో వేదాశీర్వచనం చేయించారు. అమ్మవారి చిత్రపటం, ప్రసాదం అందజేశారు.
ఆస్పత్రి నిర్మాణ పనులకు భూమిపూజ
నందిగామటౌన్: వంద పడకల ఆస్పత్రి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్యసేవలందిస్తామని వైద్యారోగ్య శాఖా మంత్రి, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. నందిగామలోని డీవీఆర్ సామాజిక ఆరోగ్య కేంద్రంలో చేపడుతున్న వంద పడకల ఆస్పత్రి విస్తరణ పనులకు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌లతో కలిసి శుక్రవారం ఆయన భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిరుపేద ప్రజలకు కార్పొరేట్ స్థాయిలో నాణ్యమైన వైద్య సేవలందించేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. అందులో భాగంగానే నందిగామ సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని వంద పడకల ఆస్పత్రిగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకుడు బచ్చుల సుబ్రహ్మణ్యం బోస్, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ నాగేశ్వరరావు, నాయకులు మండవ కృష్ణకుమారి, కోట వీరబాబు, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అమ్మవారిని దర్శించుకున్న కలెక్టర్ దంపతులు