
సకాలంలో పనులన్నీ పూర్తి చేయండి
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ ఆదేశం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దసరా ఉత్సవాలను పురస్కరించుకుని చేపట్టిన పనులన్నీ సకాలంలో పూర్తయ్యేలా చూడాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ దుర్గగుడి ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో నిర్వహించే దసరా ఉత్సవాల ఏర్పాట్లను మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర, ఏడీసీపీ జి.రామకృష్ణ, వెస్ట్ ఏసీపీ దుర్గారావు, దుర్గగుడి ఈవో శీనానాయక్‌లతో కలిసి కలెక్టర్ గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తొలుత కెనాల్‌రోడ్డులోని వినాయకుడి గుడి వద్ద ప్రారంభమయ్యే క్యూలైన్లు, సీతమ్మ వారి పాదాల వద్ద హోల్డింగ్ పాయింట్లు, కేశఖండనశాలను పరిశీలించారు.
హోల్డింగ్ పాయింట్లు పెంచాలి..
ఈ ఏడాది భక్తులను హోల్డింగ్ పాయింట్ ద్వారా క్యూలైన్‌లోకి అనుమతించాలని, అదే విధంగా రద్దీకి అనుగుణంగా పాయింట్లను పెంచాలని నిర్ణయించారు. క్యూలైన్లలో భక్తులకు అత్యవసర పరిస్థితులు ఎదురైతే వారు ఏ విధంగా బయటకు రావాలనే అంశాల గురించి ఇంజినీరింగ్ అధికారులను ఆరా తీశారు. మరుగుదోడ్లు, వైద్య సహాయ కేంద్రాలు, సమాచార కేంద్రాలు ఎక్కడ ఉన్నాయనే దానిపై భక్తులకు సమాచారం తెలిసేలా బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. పర్యటనలో దుర్గగుడి ఈఈలు కేవీఎస్ కోటేశ్వరరావు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.