
సుస్వరాల కోయిలకు కీర్తి కిరీటం
విజయవాడ కల్చరల్: ఆమె గాత్రంలోని మాధుర్యం శ్రోతలను కట్టిపడేస్తుంది.. వయోలిన్‌పై ఆమె చేసే స్వర విన్యాసం సంగీత ప్రియులకు పరవశించేలా చేస్తుంది. ఆమె వేదికపై ఉందంటే సంగీత అభిమానులకు పండుగే. ఆమే విజయ వాడకు చెందిన వయోలిన్ విద్వాంసురాలు బీవీ దుర్గాభవాని. విఖ్యాత హరికథా భాగవతార్ కుమార్తెగా ఆమె సంగీత రంగంలో విశేషమైన ప్రతిభ కనబరుస్తున్నారు. దశాబ్దాల పాటు సాగిన ఆమె సంగీత ప్రస్థానానికి ఇప్పుడు కీర్తి కిరీటం దక్కింది. సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీ నుంచి కీర్తి పురస్కారం వరించింది.
సంగీత ప్రస్థానం సాగిందిలా..
బీవీ దుర్గాభవాని బహుముఖ ప్రతిభాశాలి. అటువాయిలీనం, ఇటు గాత్రం.. రెంటినీ సమర్థంగా పోషించగల సంగీత సవ్యసాచి. ఆమె 1965లో విజయవాడలో జన్మించారు. తండ్రి విశ్వనాథ భాగవతార్ వద్ద సంగీతంలో శిక్షణ తీసుకున్నారు. అటు గాత్రంలోనూ ఇటు వయోలిన్‌లోను ప్రతిభతో ఉన్నత శిఖరాలకు చేరుకున్నారు. సుదీర్ఘకాలం ఆకాశవాణి కేంద్రంలో వయోలిన్ విద్వాంసురాలిగా పనిచేశారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఆరేళ్లపాటు వయోలిన్ అధ్యాపకురాలిగా పనిచేశారు. ప్రముఖ వయోలిన్ విద్వాంసులు అన్నవరపు రామస్వామి శిష్యరికంలో సంగీత విద్యను సార్థకం చేసుకున్నారు.
ప్రముఖుల సరసన..
ప్రముఖ సంగీత విద్వాంసులు మంగళంపల్లి బాలమురళీకృష్ణ, నూకల చిన సత్యనారాయణ, టీఎన్ శేషగోపాలన్, ప్రపంచం సీతారాం, టీఎం కృష్ణ, బోంబే సిస్టర్స్, హైదరాబాద్ బ్రదర్స్‌తోపాటు పలువురు విద్వాంసులకు వాద్య సహకారమందించారు.
అందుకున్న అవార్డులు..
మద్రాస్ మ్యూజిక్ అకాడమీ, ఇండియన్ ఫైన్ ఆర్ట్స్, మద్రాస్ మ్యూజికల్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్, రసిక రంజని, ఆంధ్ర మ్యూజిక్ అకాడమీలు ఆమెకు పురస్కారాలను అందజేశాయి. కాగా ఇప్పుడు సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం ఏటా వివిధ రంగా ల్లోని ప్రతిభావంతులకు అందించే కీర్తి పురస్కారానికి దుర్గా భవానీ ఎంపికై ంది. ఈ నెల 23, 24 తేదీలలో జరిగే సభల్లో రూ.5,116 నగదుతోపాటు జ్ఞాపికలు అందజేయనుంది.
వయోలిన్ విద్వాంసురాలు దుర్గాభవానీకి తెలుగు వర్సిటీ పురస్కారం