
అంతుచిక్కని అతిసార
ఇళ్లల్లో ఉండలేకపోతున్నాం..
51 ఆర్వో వాటర్ సప్లయ్ దుకాణాలు సీజ్
అంతకంతకూ పెరుగుతున్న
బాధితుల సంఖ్య
కచ్చితమైన కారణాలు గుర్తించని అధికారులు
కంటితుడుపు చర్యలకే సర్కారు పరిమితం
తాజాగా మరోవ్యక్తి మృతి
ఆందోళనలో న్యూ ఆర్‌ఆర్‌పేట వాసులు
కొనసాగుతున్న వైద్య శిబిరాలు
లబ్బీపేట/అజిత్‌సింగ్‌నగర్: న్యూరాజరాజేశ్వరి పేటలో అతిసార వ్యాధి అదుపులోకి రాలేదు. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండగా, మృతుల సంఖ్య కూడా మూడుకు చేరింది. ప్రజలు అతిసార బారినపడటానికి ఖచ్చితమైన కారణాన్ని ప్రభుత్వం ఇప్పటివరకు గుర్తించలేకపోయింది. పూటపూటకీ రోగుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళనకరంగా మారగా, అధికారులు మాత్రం పరిస్థితి అదుపులోనే ఉందని చెప్పుకొస్తుండటం గమనార్హం. మంగళవారం రాత్రి నుంచి శుక్రవారం సాయంత్రం వరకూ దాదాపు 194 మంది డయేరియా బారిన పడినట్లు అధికారికంగా ప్రకటించారు. అధికారుల దృష్టికి రానివారు మరో 20 మంది వరకూ ఉండొచ్చునని అంచనా. ఇప్పటికే అతిసారతో ఇద్దరు మృతిచెందగా, వాంతులు విరచేనాలతో బాధపడుతూ తాజాగా శుక్రవారం రాత్రి మరో వ్యక్తి మృతిచెందారు.
జీజీహెచ్‌లో 106మంది రోగులు..
విజయవాడ ప్రభుత్వాస్పత్రికి డయేరియా రోగులు పెరుగుతూనే ఉన్నారు. ప్రస్తుతం 106మంది అతిసార బాధితులు చికిత్స పొందుతుండగా, 88మంది డిశార్జి అయ్యారు. బాధితులను రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, జిల్లా కలెక్టర్ లక్ష్మీశా తదితరులు పరామర్శించి నాణ్యమైన వైద్యం అందించాలని ఆదేశించారు.
కారణాన్ని గుర్తించని వైనం..
అతిసారకు గల కారణాన్ని అధికారులు సైతం ఇప్పటివరకూ ప్రకటించలేదు. వినాయకుని వేడుకల్లో భోజనాలు చేశారని కొందరు, వంకాయ కూరలో రొయ్యలు వేసుకుంటే వాంతులు అయ్యాయని మరికొందరు చెబుతున్నారు. మంత్రులు సైతం ఇదే విషయాలను చెప్పుకొస్తున్నారు. భారీసంఖ్యలో ప్రజలు అతిసార బారిన పడ్డారంటే నీటి కలుషితమే కారణమని వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆ ప్రాంతంలో కార్పొరేషన్ సరఫరా చేసే నీటితోపాటు భూగర్భజలాలు సైతం పూర్తిగా కలుషితమైనట్లు సమాచారం. నీటికి సంబంధించి ప్రాథమిక పరీక్షలో నెగటివ్ వచ్చిందని, మరో రిపోర్టు కోసం ఎదురుచూస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. నగరపాలక సంస్థ నీటిసరఫరాను సైతం పూర్తిగా నిలిపివేశారు. ట్యాంకర్ల ద్వారా నీటిసరఫరాను కూడా నిలిపివేసి, ప్రతి ఇంటికి మినరల్ వాటర్ క్యాన్లను అందిస్తున్నారు.
బ్లీచింగ్‌తో కంటితుడుపు చర్యలు..
న్యూరాజరాజేశ్వరీపేటలో ప్రజలు ప్రాణాలు పోతున్నా... ప్రభుత్వ పెద్దలు.. ఉన్నతాధికారుల తీరు మాడరం లేదు. కేవలం ప్రజల కళ్లకు కనబడేలా ప్రధాన రహదారులపై బ్లీచింగ్ చల్లి.. ౖపైపెన కంటితుడుపు చర్యలు చేపడుతున్నారే తప్ప.. వాస్తవంగా నివాస ప్రాంతాల మధ్యలో నెలకొన్న సమస్యల పరిష్కారంపై దృష్టిసారించడం లేదు.
అధ్వానంగా పారిశుద్ధ్య పరిస్థితి..
డయేరియా వెలుగు చూసి 72 గంటల సమయం గడిచినా కూడా నేటికి న్యూరాజరాజేశ్వరీపేట అపార్ట్‌మెంట్ పరిసర ప్రాంతాలు అత్యంత అధ్వానంగా దర్శనమిస్తున్నాయి. ఇక్కడ నడిరోడ్లపైనే పదుల సంఖ్యలో పందులు సంచరిస్తూ ఉన్నాయి. కాలువలన్నీ చెత్తతో నిండిపోగా.. అపార్ట్‌మెంట్‌ల మధ్య స్థలాలు మురుగునీటితో తీవ్ర దుర్వాసనలు వెదజల్లుతున్నాయి. ఇక అపార్ట్‌మెంట్‌ల డ్రెయినేజీ పైపులన్నీ గతేడాది బుడమేరు వరదలో పగిలిపోగా నేటికి వాటి పరిస్థితి అలానే ఉండడంతో ఆ మురుగు, వ్యర్థాలన్నీ రోడ్లపైకి చేరి నివాసాల ముందు పారుతుండటం గమనార్హం. ఇక మంచినీటి పైపులైన్లు కూడా పగిలిపోవడంతో పక్కనే ఉన్న మురుగునీరు పైపుల్లో చేరుతూ కలుషితనీరే సరఫరా అవుతోందంటూ స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
మాది 17వ నంబర్ బ్లాకు.. ఈ ఇళ్ల మధ్య మురుగు, చెత్త తొలగించకపోతుండటంతో దుర్వాసనకు ఇళ్లల్లో అస్సలు ఉండలేకపోతున్నాము. తరచూ జ్వరాలు, వాంతులు, విరేచనాల సమస్యలతో అల్లాడిపోతున్నాం.
శశిరేఖ,
17వ బ్లాకు
వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో న్యూరాజరాజేశ్వరపేటలో ఏర్పాటు చేసిన వైద్యశిబిరాలు కొనసాగుతున్నాయి. డీఎంహెచ్‌ఓ ఆధ్వర్యంలో దాదాపు నగరంలోని వైద్యసిబ్బంది అంతా అక్కడే పనిచేస్తున్నారు. అంతేకాకుండా నగర సమీపంలోని పీహెచ్‌సీలు, వెల్నెస్ సెంటర్ల నుంచి సీహెచ్‌ఓలకు కూడా డ్యూటీలు వేశారు. ఇప్పటివరకూ న్యూరాజరాజేశ్వరిపేటలో ప్రతి ఇంటిని రెండు, మూడుసార్లు సర్వేచేసి జల్లెడ పట్టారు. అయినప్పటికీ అతిసారకు కారణం మాత్రం కనుగొనలేకపోవడం గమనార్హం. వాంతులు, విరోచనాలు అవుతున్న వారికి మాత్రం సకాలంలో వైద్యం అందించగలుగుతున్నారు.
భవానీపురం(విజయవాడపశ్చిమ): నగర పరిధిలో ప్రైవేట్ ఆర్వో వాటర్ సప్లయ్ దుకాణాలను నగరపాలక సంస్థ అధికారులు సీజ్ చేశారు. కొత్త రాజరాజేశ్వరిపేటలో అతిసార వ్యాధితో కొందరు బాధపడుతున్న నేపథ్యంలో ప్రజల ఆరోగ్యం దృష్ట్యా మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు నగరపాలక సంస్థ ప్రజారోగ్య అధికారులు, సిబ్బంది శుక్రవారం ఆర్వో వాటర్ సప్లయ్ దుకాణాలను తనిఖీ చేశారు. నగర పరిధిలో మొత్తం 216 ప్రైవేట్ ఆర్వో వాటర్ సప్లయ్ దుకాణాలు ఉండగా, వాటిని పూర్తిస్థాయిలో పరిశీలించారు. ట్రేడ్ లైసెన్స్ లేకపోయినా, తాజాగా వాటర్ టెస్టింగ్ ల్యాబ్ రిపోర్ట్‌లేని 51 దుకాణాలను సీజ్ చేశారు. 57వ డివిజన్ కొత్త రాజరాజేశ్వరిపేట పరిధిలోని తొమ్మిది చికెన్ షాపులు, ఒక బీఫ్ షాపును వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ బి.సోమశేఖర్‌రెడ్డి మూసి వేయించారు. అదే ప్రాంతంలో ఫుడ్ సేఫ్టీ, నగరపాలక సంస్థ అధికారుల సంయుక్తంగా తనిఖీలు చేసి 24 ఆహార దుకాణాలను సైతం మూసివేయించారు.

అంతుచిక్కని అతిసార

అంతుచిక్కని అతిసార