
జనసేన రౌడీల దుశ్చర్య
మచిలీపట్నంటౌన్: జనసేన రౌడీలు గురువారం రాత్రి వైఎస్సార్ సీపీ కార్యకర్త మద్దాల సతీష్ బాబుకు చెందిన దుకాణాన్ని ఇష్టానుసారంగా ధ్వంసం చేశారు. బందరు మండలం సత్రంపాలెంలో గిరిధర్‌పై దాడి చేసిన అనంతరం.. అదే గ్రామంలోని అంబేడ్కర్ విగ్రహం సమీపంలో ఉన్న సతీష్ బాబు బడ్డీ కొట్టును ధ్వంసం చేశారు. దుకాణంలో ఉన్న ఫ్రిడ్జ్‌ని పగలగొట్టారు. తన దుకాణాన్ని సతీష్ బాబు మూసివేసి తాళాలు వేసి వెళ్లిన అనంతరం జనసేన గూండాలు అక్కడికి చేరుకుని వేసి ఉన్న తాళాలు పగలగొట్టి దుకాణంలోకి వెళ్లి విధ్వంసం సృష్టించారు. అక్కడ సతీష్ బాబు ఉంటే హత్య చేయాలనే తలంపుతో వెళ్లిన వారు అక్కడ సతీష్ బాబు లేకపోవడంతో అతని దుకాణాన్ని ఇష్టానుసారంగా పగలగొట్టారు.
అందుకే కక్షకట్టారు..
ఈనెల తొమ్మిదో తేదీ మంగళవారం మచిలీపట్నంలోని ధర్నా చౌక్ వద్ద జరిగిన అన్నదాత పోరు కార్యక్రమంలో సత్రంపాలెంకు చెందిన ఆర్‌ఎంపీ వైద్యుడు గిరిధర్, సతీష్ బాబు తదితర వైఎస్సార్ సీపీ కార్యకర్తలు హాజరయ్యారు. ఈ క్రమంలో ఓ మీడియా సంస్థకు గిరిధర్ వాయిస్ ఇచ్చారు. డెప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌కు పదవి రాకముందు ఎలాంటి వ్యాఖ్యలు చేశారు.. ఇప్పుడు ఎలా మౌనంగా ఉంటున్నారో వివరించారు. ఈ వాయిస్ వీడియోలో సతీష్ బాబు కూడా కనిపించారు. దీంతో సతీష్ బాబుపై కూడా అక్కసు పెంచుకున్న జనసేన నాయకులు కొరియర్ శ్రీను, శాయన శివయ్యలతో కలిసి జనసేన గూండాలు అతనిపై కూడా దాడి చేసేందుకు గురువారం రాత్రి గ్రామానికి వెళ్లారు. ఆ సమయంలో సతీష్ బాబు తన షాపునకు తాళాలు వేసి వెళ్లడంతో దుకాణం తాళాలు పగలగొట్టి మరీ ధ్వంస రచన చేశారు. ఈ ఘటనను పలు దళిత సంఘాల నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారు. దళితుడి బడ్డీ దుకాణాన్ని ధ్వంసం చేసిన వారిని పోలీసులు వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దాడికి పాల్పడిన వారిపై పోలీసులు చర్యలు తీసుకోకుంటే ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని వారు హెచ్చరిస్తున్నారు.