
యూపీఎస్సీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఈనెల 14వ తేదీన జరగనున్న యూపీఎస్సీ– నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నేవల్ అకాడమీ (2), కంబైన్డ్ డిఫెన్స్ అకాడమీ (2) పరీక్షల నిర్వహణకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ ఆదేశించారు. అభ్యర్థులకు ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు. కలెక్టర్ లక్ష్మీశ శుక్రవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఎన్‌డీఏ అండ్ ఎన్‌ఏ, సీడీఎస్ పరీక్షల నిర్వహణపై యూపీఎస్సీ అబ్జర్వర్ హరీష్‌కుమార్, జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియతో కలిసి లైజన్ ఆఫీసర్లు, పరీక్షా కేంద్రాల పర్యవేక్షకులు, వైద్య ఆరోగ్యం, విద్యుత్, రెవెన్యూ, రవాణా, పోస్టల్ తదితర శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ ఈనెల 14న విజయవాడలో ఆరు కేంద్రాల్లో పరీక్ష జరుగుతుందన్నారు. సీడీఎస్‌కు 672 మంది, ఎన్‌డీఏ అండ్ ఎన్‌ఏ పరీక్షకు 718 అభ్యర్థులు హాజరుకానున్నట్లు తెలిపారు. సీడీఎస్ పరీక్ష మూడు షిఫ్ట్‌ల్లో, ఎన్‌డీఏ అండ్ ఎన్‌ఏ పరీక్ష రెండు షిఫ్ట్‌ల్లో ఉంటుందని వివరించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా ఆశాఖ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వైద్యశిబిరాన్ని ఏర్పాటుచేయాలన్నారు. అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా ఆర్టీసీ బస్‌స్టేషన్, రైల్వేస్టేషన్ నుంచి బస్సులు ఏర్పాటు చేయాలన్నారు. పరీక్ష నిర్వహణకు సంబంధించిన నిబంధనలను తూ.చ.తప్పకుండా పాటించాలన్నారు. పరీక్ష సజావుగా జరిగేలా పోలీసుశాఖ తగిన భద్రత కల్పించాలని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు. సమావేశంలో డీఆర్‌వో ఎం.లక్ష్మీనరసింహం, విజయవాడ ఆర్‌డీవో కావూరి చైతన్య, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ