
ఆకాంక్షిత మండలాలకు నీతి ఆయోగ్ పట్టం
అభినందించిన మంత్రి సత్యకుమార్ యాదవ్
భవానీపురం(విజయవాడపశ్చిమ): కేంద్రం ప్రకటించిన ఎన్టీఆర్ జిల్లాలోని ఇబ్రహీంపట్నం, పెనుగంచిప్రోలు ఆకాంక్షిత మండలాలు.. ఆదర్శ మండలాలుగా నిలవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆకాంక్షించారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మంగళవారం నిర్వహించిన సంపూర్ణత అభియాన్ సమ్మాన్ సమరోహ్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆ రెండు మండలాలకు నీతి అయోగ్ బంగారు పతకాలను ప్రకటించగా ఈ ప్రగతిలో భాగస్వాములైన అధికారులు, సిబ్బందికి 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశతో కలిసి మంత్రి సత్యకుమార్ యాదవ్ బంగారు పతకాలు, ప్రశంసా పత్రాలను అందజేశారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశను ప్రత్యేకంగా సత్కరించి అభినందించారు. కార్యక్రమంలో భాగంగా స్వయం సహాయక సంఘాల మహిళలు ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు.
బంగారు పతకాలు రావడం అభినందనీయం
విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) మాట్లాడుతూ జిల్లాలోని రెండు మండలాలకు నీతి ఆయోగ్ బంగారు పతకాలు రావడం అభినందనీయమని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ వైద్య ఆరోగ్యం, మహిళా, శిశు సంక్షేమం, డీఆర్‌డీఎ అధికారుల కృషి కారణంగా ఈ విజయం సాధించామని తెలిపారు.
సత్కారం పొందిన అధికారులు ఇవే..
సీపీఓ వై. శ్రీలత, డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఎం. సుహాసిని, ఐసీడీఎస్ పీడీ షేక్ రుక్సానా, జిల్లా వ్యవసాయ అధికారి విజయకుమారి, డీఆర్‌డీఏ పీడీ ఏఎన్‌వీ నాంచారరావు ఉన్నారు. అలాగే ఇబ్రహీంపట్నం, పెనుగంచిప్రోలు ఎంపీడీఓలు, ఏబీపీ కో ఆర్డినేటర్లు జి. మోహన్ సందీప్, పి. శ్రీనివాస్, వివిధ మండల స్థాయి అధికారులు, వైద్య ఆరోగ్యం, వ్యవసాయం, సామాజిక అభివృద్ధి ఫ్రంట్‌లైన్ వర్కర్లు సత్కారం అందుకున్నారు. కార్యక్రమంలో విజయవాడ ఆర్డీఓ కావూరి చైతన్య, నందిగామ ఆర్డీఓ కె. బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.