ఆక్వా కుయ్యో.. రొయ్యో | - | Sakshi
Sakshi News home page

ఆక్వా కుయ్యో.. రొయ్యో

Sep 5 2025 4:56 AM | Updated on Sep 5 2025 4:56 AM

ఆక్వా

ఆక్వా కుయ్యో.. రొయ్యో

ఆక్వా కుయ్యో.. రొయ్యో

సాగు భారం

అన్నీ నష్టాలే

విద్యుత్‌ ధరలు తగ్గించండి

గుడివాడరూరల్‌: ఆక్వా రైతు కుదేలవుతున్నాడు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వేసిన సుంకాల భారం ఆక్వా ఎగుమతులపై ప్రభావం చూపుతోంది. మొన్నటి వరకు మూడుశాతం ఉన్న సుంకాలను 50 శాతం మేరకు పెంచడం గుదిబండలా మారింది. రొయ్యల ధరలు పతనమవుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను ఏడాది దాటినా అమలు చేయకపోవడంతో ఆక్వా రైతులు తీవ్ర నష్టాల ఊబిలో కూరుకుపోయారు. రాష్ట్రంలోనే ఆక్వా ఎగుమతుల్లో కృష్ణా జిల్లా అగ్రగామిగా ఉంది. ఇక్కడ నుంచే ఇతర రాష్ట్రాలతో పాటు వివిధ దేశాలకు రొయ్యల, చేపల ఎగుమతులవుతున్నాయి. దాదాపుగా జిల్లాలో 1,03, 977 ఎకరాల్లో రొయ్యల, చేపల చెరువులు సాగవుతున్నాయి. 46,385 ఎకరాలు రొయ్యల సాగును రైతులు చేస్తున్నారు. రొయ్యల సాగు కారణంగా జిల్లాలో ఆక్వా ప్రొసెసింగ్‌ యూనిట్లు, హేచరీలు, కోల్డ్‌స్టోరేజ్‌లు ఉన్నాయి. ముఖ్యంగా అమెరికా, చైనాలకు ఎక్కువగా రొయ్యల ఎగుమతులు చేస్తున్నారు. ఏటా 3 నుంచి 4లక్షల టన్నుల మేర ఉత్పత్తులు ఎగుమతవుతున్నాయి. రైతులకు ఆశాజనకమైన ధరలు లభించేవి.

ఆంక్షలతో అవస్థలు

ఎగుమతులపై ట్రంప్‌ సుంకాలు పెంచడంతో రొయ్యల ధరలు అమాంతం పడిపోయాయి. 100 కౌంట్‌ ధర ప్రస్తుతం రూ.230, 90 కౌంట్‌ ధర రూ.240, 80 కౌంట్‌ ధర రూ.260, 70 కౌంట్‌ ధర రూ.285, 60 కౌంట్‌ ధర రూ.305, 50 కౌంట్‌ ధర రూ.325, 40 కౌంట్‌ ధర రూ.335కు పడిపోయాయి. ఇప్పుడు కౌంట్‌కు రూ. 100 నుంచి 135 వరకు తేడా వస్తోంది. వైఎస్సార్‌ సీపీ హయాంలో నాడు ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీలు, ఇతర ఉపయోగాల రూపంలో ఆక్వా రైతులకు మంచి ధర పలికేది.

హామీలు విస్మరించిన కూటమి

ఆక్వా రంగంతో రాష్ట్రానికి అధిక ఆదాయం వచ్చేది. సార్వత్రిక ఎన్నికల సమయంలో కూటమి నేతలు ఆక్వా రైతులకు భరోసా ఇస్తూ వాగ్దానాలు చేశారు. రొయ్యల పరిశ్రమకు ఎక్కువగా మేలు చేసే విద్యుత్‌ ధరలను యూనిట్‌కు రూ.1.50కే ఇస్తామని హామీ ఇచ్చారు. ట్రాన్స్‌ఫార్మర్లను సైతం ఉచితంగా ఇస్తామని చెప్పారు. అయితే ఇచ్చిన వాటిలో ఒక్కటీ నెరవేరలేదు. ప్రస్తుతం యూనిట్‌ ధర రూ.3.84 ఉంది. ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటుకు రైతులకు లక్షల్లో ఖర్చు అవుతుంది. మేతల కొనుగోలుకు సైతం ధరలు తగ్గిస్తామని చెప్పిన హామీలను ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. కూటమి ఇచ్చిన హామీలను నెరవేరిస్తే కొంత మేర నష్టాల నుంచి బయటపడవచ్చని ఆశించిన ఆక్వా రైతులకు నిరాశే ఎదురవుతోంది.

రొయ్యల సాగులో లాభాలకు బదులు నష్టాలు రావడం, ధరలు పడిపోవడం, విద్యుత్‌ బిల్లుల భారం, అధికంగా రొయ్యల మేతల ధరలు పెరగడం, తరచూ వచ్చే వ్యాధుల దెబ్బకు రొయ్యల రైతులు సాగంటేనే భయపడాల్సిన దుస్థితి ఏర్పడింది.

ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలుచేసి కనీసం విద్యుత్‌ బిల్లులు తగ్గిస్తారనే ఆశ.. నిరాశగా మారడంతో రైతన్నలు సాగంటేనే ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఏర్పడింది. లీజులు ఎకరాకు రూ.90 వేల నుంచి రూ.లక్ష రూపాయల వరకు ఉండటం, ప్రభుత్వం నుంచి ఎటువంటి సబ్సిడీలు అందకపోవడంతో ఆక్వా రైతులు అప్పుల పాలైన ఘటనలు ఉన్నాయి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సమస్యను ప్రధాని వరకు తీసుకెళ్లి ఆక్వా రైతుల ఇబ్బందులు తొలగించాల్సి ఉంది.

చాలా కాలంగా రొయ్యల సాగు చేస్తున్నాం. విద్యుత్‌ భారం అధికమైంది. రొయ్యల ధరలు సైతం పతనమయ్యాయి. పెట్టుబడి ఎక్కువైంది. వచ్చే లాభాలు కన్నా నష్టాలు తీవ్రమయ్యాయి. విద్యుత్‌ ధరలు తగ్గిస్తారని ఆశించాం. అది జరగలేదు. ప్రస్తుతం సాగు భారంగా మారింది. రొయ్యల్లో వ్యాధులు సైతం ఎక్కువ కావడంతో సాగు చేయడం కష్టంగా మారింది. అన్నీ నష్టాలే వస్తున్నాయి.

–చింతాడ పెద్దిరాజు, ఆక్వా రైతు,

ఎల్‌ఎన్‌పురం, నందివాడ

ఎన్నికల సమయంలో విద్యుత్‌ ధరలు తగ్గిస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు. ప్రస్తుతం సాగులో విద్యుత్‌ వలన ఎక్కువగా పెట్టుబడి అవుతుంది. ట్రాన్స్‌ ఫార్మర్‌లు సైతం ఏర్పాటు చేసుకోవడానికి ఎక్కువ పెట్టుబడి కావడంతో ఆక్వా రైతులం ఇబ్బంది పడుతున్నాం. కూటమి ప్రభుత్వం ఉచితంగా ఇస్తామన్న ట్రాన్స్‌ ఫార్మర్‌లను ఇవ్వడం లేదు. యూనిట్‌ ధరలను తగ్గించడం లేదు. ఆక్వా రైతులు విద్యుత్‌ ధరలను తక్షణమే తగ్గించి నష్టాల బారి నుంచి కాపాడాలి.

–గురువెల్లి చంటి, ఆక్వా రైతు,

ఎల్‌ఎన్‌పురం, నందివాడ

ఆక్వా కుయ్యో.. రొయ్యో1
1/2

ఆక్వా కుయ్యో.. రొయ్యో

ఆక్వా కుయ్యో.. రొయ్యో2
2/2

ఆక్వా కుయ్యో.. రొయ్యో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement