యువత.. చెడు నడత | - | Sakshi
Sakshi News home page

యువత.. చెడు నడత

Sep 5 2025 4:56 AM | Updated on Sep 5 2025 4:56 AM

యువత.

యువత.. చెడు నడత

యువత.. చెడు నడత ● విశాఖపట్నంలో ఇంజినీరింగ్‌, ఎంబీఐ చదువుతున్న ఇద్దరు విద్యార్థులు సులువుగా డబ్బులు సంపాదించాలని భావించారు. అందుకు డ్రగ్స్‌ను విక్రయించే మార్గాన్ని ఎంచుకున్నారు. బెంగళూరు నుంచి మత్తు మందు కొనుగోలు చేసి, విశాఖలో అమ్మేందుకు తరలిస్తుండగా, విజయవాడలో ఈగల్‌, మాచవరం పోలీసులు ఇటీవల వలపన్ని పట్టుకున్నారు. ఈజీ మనీకి నేరాలకు పాల్పడినట్లు పోలీసులకు తెలిపారు. ● సత్యనారాయణపురంలో యానిమేషన్‌ వర్క్‌ చేసే వ్యక్తికి మరికొందరు పరిచయం అయ్యారు. వీరంతా కలిసి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించే మార్గం ఉందని పలువురిని నమ్మించారు. తమ వద్ద పెట్టుబడి పెడితే ఏడాదికే రెండు రెట్లు అవుతుందని నమ్మబలికారు. దాదాపు రూ.350 కోట్లు వరకూ వసూలు చేసి బోర్డు తిప్పేశారు. చివరికి పోలీసులకు చిక్కి కటకటలాల పాలయ్యారు. ● పటమటలో మైనర్‌ బాలికను ప్రేమించిన ఒక యువకుడు ఈజీమనీ కోసం దొంగతనాలకు పాల్పడ్డాడు. పటమట పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఓ ఇంట్లోకి చొరబడి బంగారు, నగదు చోరీ చేశారు. అందుకు బాలిక కూడా సహకరించింది. పోలీసుల విచారణలో వారిద్దరూ నేరస్తులుగా దొరకిపోయి జైలు పాలయ్యారు.

నేరస్తులుగా మారుతున్న విద్యార్థులు డ్రగ్స్‌, గంజాయి సైతం అమ్ముతున్న వైనం అధిక వడ్డీలు ఆశ చూపి స్నేహితులు, బంధువులనే మోసగిస్తున్న వైనం

ఈజీ మనీ కోసం అడ్డదారులు

అనవసరపు ఆడంబరాలతోనే..

లబ్బీపేట(విజయవాడతూర్పు): కష్టపడకుండా సులువుగా డబ్బులు సంపాదించడమే లక్ష్యంగా ఎక్కువ మంది యువత ఆలోచనలు ఉంటున్నాయి. ఈ తరుణంలో అనేక నేరాలు, మోసాలకు పాల్పడుతున్నారు. అలాంటి వారిలో విలాసాలకు అలవాటు పడిన వారు కొందరైతే, దురల వాట్లకు బానిసలైన వారు మరికొందరు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే అత్యాసతో మోసాలకు పాల్పడుతున్న ఇంకొందరు. మోసం ఏ రూపంలో చేసినా పోలీసులకు చిక్కి జైలు పాలవుతున్నారు. ఇలా ఇటీవల కాలంలో డబ్బు లావాదేవీల్లో మోసాలకు పాల్పడిన ఫిర్యాదులు పోలీస్‌ గ్రీవెన్స్‌లో ఎక్కువగా వస్తున్నాయి. నేరాలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కుతున్న వారు ఉంటున్నారు.

ఇవే నిదర్శనం..

ఇవి మచ్చుక కొన్ని మాత్రమే. ఇటీవల కాలంలో మోసాలు, చోరీలు, చీటింగ్‌ కేసుల్లో అరెస్టు అవుతున్న వారిలో ఎక్కువ మంది ఈజీ మనీ కోసం నేరాలకు పాల్పడుతున్న వారే ఉంటున్నారు. అంతేకాదు సైబర్‌ నేరాలు, మాయ మాటలు చెప్పి, నమ్మబలికి డబ్బులు తీసుకుని మోసం చేయడం వంటి నేరాలు ఎక్కువగా ఉంటున్నాయి.

స్నేహితులు, బంధువులనూ వదలడం లేదు..

ఈజీ మనీ కోసం తెలియని వారినే కాదు, తమ స్నేహితులు, బంధువులను సైతం మోసం చేస్తున్నారు. సత్యనారాయణపురంలోని యుపిక్స్‌ కేసులో ఎక్కువ మంది స్నేహితులు, బంధువులు ఉండటం గమనార్హం. కొందరు అమాయక ప్రజలు సైతం అధిక వడ్డీలు వస్తాయని అలాంటి వారి బుట్టలో పడిపోతున్నారు. ఇటీవల శిశువును ఇస్తామంటూ తెలంగాణకు చెందిన స్నేహితుడి నుంచే రూ.4 లక్షలు తీసుకుని మోసం చేసిన వైనం వెలుగు చూసింది. దీనిపై కలెక్టర్‌కు, పోలీస్‌ కమిషనర్‌కు సైతం ఫిర్యాదులు అందాయి.

పోలీసులు అవగాహన కల్పిస్తున్నా..

డ్రగ్స్‌, ఆల్కహాల్‌ వంటి దురలవాట్లకు లోనై జీవితాలను అంధకారం చేసుకోవద్దని పోలీసులు సూచిస్తున్నారు. సీపీ రాజశేఖర్‌ బాబు ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక బృందాలు కళాశాలలు, పాఠశాలలకు వెళ్లి అవగాహన కల్పిస్తున్నారు. డ్రగ్స్‌ మత్తులో నారాలకు పాల్పడితే అమలు చేసే శిక్షలు గురించి వివరిస్తున్నారు. అనవసరంగా జీవితాలను నాశనం చేసుకోవద్దని, ఉన్నత విద్యతోనే అత్యున్నత హోదా సాధ్యమవుతుందని తెలియజేస్తున్నారు.

ఎదుటి వారితో పోల్చుకోవడం ఇటీవల ఎక్కు వైంది. అలాంటి వారు అనవసర ఆడంబరాలకు పోతూ, ఆదాయానికి మించిన ఖర్చులతో అడ్డదారులు తొక్కుతున్నారు. కళాశాల పిల్లల్లో ఒకరు ఖరీదైన బైక్‌ వేసుకొస్తే, తమకు స్తోమత లేకున్నా అలాంటి బైక్‌ కొనాలని భావిస్తూ.. సులభంగా డబ్బు సంపాదించే మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలో యువత డగ్ర్‌కు, ఆల్కాహాల్‌కు అలవాటు పడి నేరాలకు పాల్పడుతున్నారు.

– డాక్టర్‌ గర్రే శంకరరావు,

మానసిక నిపుణులు

యువత.. చెడు నడత1
1/1

యువత.. చెడు నడత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement