
రైతులకు అందుబాటులో యూరియా
గౌరవరం(జగ్గయ్యపేట): జిల్లాలో అందుబాటులో యూరియా ఉందని రైతులు ఆందోళన చెందాల్సినవసరం లేదని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ పేర్కొన్నారు. గ్రామంలో సొసైటీలోని ఎరువుల గోడౌన్‌ను గురువారం ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో యూరియా సరఫరా సక్రమంగానే జరుగుతోందన్నారు. జిల్లా వ్యాప్తంగా పోలీస్, రెవెన్యూ, మార్కెటింగ్, వ్యవసాయాధికారుల పర్యవేక్షణలో జాయింట్ యాక్షన్ టీం పర్యవేక్షిస్తోందన్నారు. ఈ టీం యూరియా సరఫరా ఎలా ఉంది.. బ్లాక్ మార్కెట్‌కు తరలుతుందా లేదాని చూస్తారని తెలిపారు. జిల్లాలో మూడు వేల మెట్రిక్ టన్నుల యూరియా అందు బాటులో ఉందని మరో వారంలో పల్నాడు జిల్లా నుంచి రెండు వేల మెట్రిక్ టన్నుల యూరియా వస్తుందని తెలిపారు. కలెక్టర్ కార్యాలయానికి సంబంధించి కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారని చెప్పారు. ఇప్పటికే 6ఏ కేసులు 11 నమోదు చేశామని తెలిపారు. రైతులు కూడా అవసరం మేరకే యూరియా తీసుకోవాలని ఇష్టానుసారం యూరియా వినియోగించొద్దని ఎకరాకు 90 కిలోల యూరియా సరిపోతుందని చెప్పారు. అనంతరం కార్యదర్శి నాగేశ్వరరావును స్టాకు వివరాలను, రైతులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో నందిగామ ఆర్డీవో బాలకృష్ణ, ఇన్‌చార్జ్ తహసీల్దార్ మనోహర్, ఏడీఏ భవానీ, సీఐ వెంకటేశ్వర్లు, సొసైటీ చైర్మన్ నరసింహారావు, ఏవో వరలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ లక్ష్మీశ