
7న ఆలయాల మూసివేత
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): రాహుగ్రస్త పాక్షిక చంద్రగ్రహాన్ని పురస్కరించుకుని ఈ నెల ఏడో తేదీ ఆలయాలను మూసివేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఆ రోజు రాత్రి 9.56 నుంచి అర్ధరాత్రి 1.26 గంటల వరకు గ్రహణ కాలంగా ఉంటుందని దుర్గగుడి అర్చకులు పేర్కొన్నారు. చంద్రగ్రహణాన్ని పురస్కరించుకుని ఏడో తేదీ మధ్యాహ్నం 3.30 గంటలకు దుర్గగుడి ప్రధాన ఆలయంతో పాటు మల్లేశ్వర స్వామి వారి ఆలయం, ఇంద్రకీలాద్రిపై ఇతర ఉపాలయాల తలుపులు మూసివేస్తామని వివరించారు. ఎనిమిదో తేదీ సంప్రోక్షణ అనంతరం ఉదయం 8.30 గంటలకు భక్తులను దర్శనానికి అనుమతిస్తామని పేర్కొన్నారు.
మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయాన్ని ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకు మూసివేయనున్నట్లు డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు బుధవారం తెలిపారు. దీంతోస్వామివారి నిత్య శాంతి కల్యాణం ఆదివారం ఉదయం 10 గంటలకు ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఆలయాన్ని 8వ తేదీ సోమవారం ఉదయం 10 గంటలకు మహాసంప్రోక్షణ అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తారని పేర్కొన్నారు.
పెనుగంచిప్రోలు: చంద్ర గ్రహణం సందర్భంగా గ్రామంలోని శ్రీతిరుపతమ్మ ఆలయాన్ని 7వ తేదీ మహానివేదన అనంతరం 11 గంటల నుంచి 8వ తేదీ ఉదయం 4 గంటల వరకు మూసివేస్తున్నట్లు ఈఓ కిషోర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 8వ తేదీ ఉదయం 8 గంటలకు నిత్య పూజలు జరుగుతాయని పేర్కొన్నారు.