
పీ–4 కార్యక్రమాన్ని వేగవంతం చేయండి
కలెక్టర్ డీకే బాలాజీ
చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో పీ–4 కార్యక్రమాన్ని నిబంధనలకు అనుగుణంగా వేగవంతం చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ గీతాంజలిశర్మ, అసిస్టెంట్ కలెక్టర్ ఫర్హీన్ జాహిద్ తో కలిసి పీ–4 కార్యక్రమం పురోగతిపై సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 78,670 కుటుంబాలను బంగారు కుటుంబాలుగా గుర్తించామని చెప్పారు. ఇందులో అత్యధికంగా పెడన నియోజకవర్గంలో 12,661, అత్యల్పంగా పెనమలూరు నియోజకవర్గంలో 8,813 కుటుంబాలు గుర్తించామని పేర్కొన్నారు. వీటిలో 47,876 బంగారు కుటుంబాలను 4,286 మార్గదర్శిలకు అనుసంధానం చేసి దత్తత ఇచ్చామని వెల్లడించారు. జిల్లాకు చెందిన ధనికులు, ప్రముఖులు దాతృత్వం, మానవత్వం కలిగిన వ్యక్తులు స్థానికంగా గానీ ఇతర దేశాల్లో, రాష్ట్రాల్లో ఉన్న వారి వివరాలను సేకరించి పీ–4 కార్యక్రమం గురించి వారికి అవగాహన కల్పించి స్వచ్ఛందంగా చేయూతనిచ్చేందుకు ముందుకు వచ్చేలా చొరవ చూపాలని కోరారు. ఈ సమావేశంలో నియోజకవర్గాల ప్రత్యేకాధికారులు జెడ్పీ డెప్యూటీ సీఈవో ఆర్‌సీ ఆనంద్‌కుమార్, మెప్మా పీడీ పి. సాయిబాబు, డ్వామా పీడీ ఎన్‌వీ శివప్రసాద్, పశుసంవర్ధకశాఖ అధికారి చిననరసింహులు, మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్ మురళీకిషోర్, మార్కెటింగ్ ఏడీ నిత్యానందం తదితరులు పాల్గొన్నారు.