ఉమ్మడి జిల్లాలో పనులు..
మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఉమ్మడి జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించారు.
కృష్ణా డెల్లా పరిధిలో 13.6 లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా రూ. 4,573 కోట్లతో ఆధునికీకరణకు పరిపాలన అనుమతులిచ్చారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో రూ. 2,180 కోట్లు వెచ్చించారు. 2008 జూన్ ఆరో తేదీన అవనిగడ్డ మండలం పులిగడ్డవార్పు వద్ద డెల్టా ఆధునికీకరణ పనులు శంకుస్థాపన చేసి ప్రారంభించారు. ఆయన హయాంలోనే 40 శాతం పనులు పూర్తయ్యాయి.
2008 ఏప్రిల్ 23వ తేదీన రూ.1,500 కోట్లతో బందరు పోర్టు శంకుస్థాపన చేశారు. దానిని స్ఫూర్తిగా తీసుకొని పోర్టు పనులను ఆయన తనయుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ముందుకు తీసుకెళ్లారు.
కృష్ణా డెల్టాకు ఆయుపు పట్టు అయిన పులిచింతల ప్రాజెక్టును నిర్మించారు. కృష్ణా డెల్టా ఆయకట్టుకు జీవం పోశారు. గుంటూరు, విజయవాడ నగరాలకు తాగునీటి సమస్య తలెత్తకుండా చేశారు.
అవనిగడ్డ, విజయవాడ మధ్యప్రయాణ దూరాన్ని తగ్గించేందుకు అప్పటి వరకూ సింగిల్ రోడ్డుగా ఉన్న కరకట్ట రహదారిని రెండు లైన్లకు విస్తరించారు.
నాగాయలంక మండలం భావదేవరపల్లిలో రాష్ట్రంలో తొలి మత్య్సకార పాలిటెక్నిక్ కళాశాలను వైఎస్సార్ ఏర్పాటు చేశారు.
నూజివీడులో ప్రతిష్టాత్మక ట్రిపుల్ ఐటీని ఏర్పాటు చేసి ప్రత్యేక గుర్తింపు తెచ్చారు. అక్కడ వేలాది మంది పిల్లలు సాంకేతిక విద్యను ఉచితంగా అందుకుంటున్నారు.
సాక్షి ప్రతినిధి, విజయవాడ: మహానేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఉమ్మడి కృష్ణా జిల్లాపై చెరగని ముద్ర వేశారు. ఇప్పటికీ ఆయన చేసిన సేవలను ప్రజలు కొనియాడుతున్నారు. మంగళవారం ఆయన వర్ధంతిని పురస్కరించుకొని జిల్లాకు ఆయన చేసిన అభివృద్ధిని జిల్లా వాసులు మరోసారి మననం చేసుకుంటున్నారు. మరోవైపు వైఎస్సార్ సీపీ శ్రేణులు, అభిమానులు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేసేందుకు సన్నద్ధం అవుతున్నారు.
ఆ పేరే ప్రత్యేకం..
వైఎస్సార్.. ఈ పేరు వింటేనే ఏదో ఆత్మీయత, కొండంత భరోసా, అభివృద్ధికి చిరునామాగా ప్రజలు తలుస్తారు. జలయజ్ఞంతో రైతుల పాలిట అపర భగీరథుడిగా.. ఆరోగ్యశ్రీతో పేదల గుండెల్లో ఊపిరిగా.. అభివృద్ధిని చేతల్లో చేసి చూపించిన సిసలైన నాయకుడిగా నిలిచిపోయారు. అందుకే ఆ మహానీయుడు భౌతికంగా దూరమై ఏళ్లు గడుస్తున్నా.. ఇప్పటికీ అందరి మదిలో కొలువై ఉన్నారు. ‘నమస్తే అక్కయ్య.. నమస్తే చెల్లెమ్మ.. నమస్తే తమ్ముడూ’ అంటూ ఆప్యాయంగా పిలిచే ఆ పిలుపు అందరి చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది.