నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదు | - | Sakshi
Sakshi News home page

నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదు

Sep 2 2025 8:19 AM | Updated on Sep 2 2025 8:19 AM

నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదు

నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదు

అర్జీల పరిష్కారంలో ఉదాసీనతను సహించం జిల్లా స్థాయి పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్‌ లక్ష్మీశ ప్రజల నుంచి 92 అర్జీలు స్వీకరణ

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌)కు వచ్చే ప్రతి అర్జీపైనా ప్రత్యేకంగా దృష్టి సారించాలని, సమస్యల పరిష్కారంలో ఉదాసీనతను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని కలెక్టర్‌ డాక్టర్‌ జి. లక్ష్మీశ అన్నారు. నిర్లక్ష్యం వహిస్తే అధికారులపై సస్పెన్షన్‌ వేటు తప్పదని అధికారులను ఆయన హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్‌ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమం జరిగింది. జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.ఇలక్కియతో కలిసి కలెక్టర్‌ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ లక్ష్మీశ మాట్లాడుతూ ప్రజల సమస్యలను తమ సమస్యలుగా భావించి పరిష్కారానికి కృషిచేయాలని ఆదేశించారు. ఎండార్స్‌మెంట్‌ ఇచ్చేసి చేతులు దులుపుకొంటే సహించేది లేదని.. తప్పనిసరిగా సమస్యకు సరైన విధంగా పరిష్కారం చూపాల్సిందేనని స్పష్టం చేశారు.

కొత్త విధానంలో..

ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలనే లక్ష్యంతో కలెక్టరేట్‌లో నిర్వహిస్తున్న పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్‌ కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. ఇప్పటివరకు కలెక్టరేట్‌లో నిర్వహిస్తున్న పీజీఆర్‌ఎస్‌కు అర్జీదారుడు వారి సమస్యపై నేరుగా వేదిక వద్ద ఉన్న కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌, డీఆర్‌వోలను కలిసి అర్జీలను సమర్పించి విన్నవించుకునేవారు. అర్జీదారుని సమస్యను విని పరిష్కారం కోసం సంబంధిత జిల్లా అధికారులను పిలిచి అర్జీలను అప్పగించేవారు. సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌ ఇందుకు భిన్నంగా కొనసాగింది. అర్జీదారుడు వారి అర్జీలను నమోదు చేసుకొని ముందుగా సమస్యకు సంబంధించిన జిల్లా అధికారిని కలిసే విధంగా జిల్లా కలెక్టర్‌ చర్యలు తీసుకున్నారు. సమస్యకు గల కారణాలు అధికారి తెలుసుకొని, గతంలో కింది స్థాయి అధికారులు అలసత్వం లేదా ఇబ్బందులకు గురి చేయడం వంటివి ఏవైనా జరిగితే వాటిని నమోదు చేస్తారు. ఆ తర్వాత తదుపరి చర్యల నిమిత్తం అర్జీదారును కలెక్టర్‌ వద్దకు పంపుతారు. సమస్య పరిష్కారంలో కింది స్థాయిలో జరుగుతున్న జాప్యాన్ని, అలసత్వం, అర్జీదారుడు పడుతున్న ఇబ్బందులు వంటి వాటిని క్షుణ్ణంగా పరిశీలించి సాధ్యమైనంత వరకు జిల్లా అధికారుల స్థాయిలోనే పరిష్కారం చూపాలన్నారు. ఈ విషయంలో ఏదైనా ఇబ్బంది ఉంటే అర్జీలో నమోదు చేసి, తన దృష్టికి తీసుకువస్తే తక్షణమే పరిష్కారం చూపేందుకు చర్యలు తీసుకుంటానన్నారు. పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమంలో మొత్తం 92 అర్జీలు అందాయని తెలిపారు. కార్యక్రమంలో గ్రామ, వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి జి.జ్యోతి, కేఆర్‌సీసీ స్పెషల్‌ డెప్యూటీ కలెక్టర్‌ కె.పోసిబాబు, ఏసీపీ కె.వెంకటేశ్వరరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement