
ప్రజలకు మరింత చేరువగా పోలీసు సేవలు
ఎస్పీ గంగాధరరావు
కోనేరుసెంటర్: ప్రజలకు మరింత చేరువగా పోలీసు సేవలను అందిస్తున్నట్లు జిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీకోసంలో పాల్గొని ప్రజల నుంచి అర్జీలు అందుకున్నారు. సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. కొన్నింటిని అక్కడికక్కడే పరిష్కరించారు. మరి కొన్ని సమస్యలను సంబంధిత అధికారులకు అప్పగించి బాఽధితులకు వెంటనే న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలకు పోలీసుశాఖ అన్ని విధాలా అండగా ఉంటుందన్నారు. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ పోలీసు వ్యవస్థ ప్రత్యక్షమవుతుందన్నారు. ప్రజలకు ఎలాంటి అన్యాయం జరిగినా మీకోసంలో నేరుగా ఫిర్యాదు చేయవచ్చునని తెలిపారు. తన దృష్టికి వచ్చిన ప్రతి ఫిర్యాదును పరిష్కారం చూపిస్తానని చెప్పారు. అలాగే మీకోసం ద్వారా న్యాయం జరగని బాధితులు ఎవరైనా ఉంటే తనను మరలా కలిసి జరిగిన విషయాన్ని వివరించి న్యాయం కోరవచ్చునన్నారు. మీ కోసంలో 39 అర్జీలు అందినట్లు పేర్కొన్నారు.