
నేరస్తుల వైపే చంద్రబాబు, పవన్
సుగాలి ప్రీతి కేసులో చంద్రబాబు న్యాయం చేయలేదు తొలి సంతకం అన్న పవన్ యూ టర్న్ తీసుకున్నారు మాజీ ఐఏఎస్ అధికారి, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకుడు విజయ్‌కుమార్
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): గత టీడీపీ ప్రభుత్వంలోనే గిరిజన బాలిక సుగాలి ప్రీతిపై లైంగికదాడి, హత్య జరిగాయని.. ఆ ప్రభుత్వం న్యాయం చేయలేదని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకుడు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి విజయ్‌కుమార్ చెప్పారు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నేరస్తుల వైపు ఉన్నారని, 2017 నుంచి 2019 వరకు కేసును తాత్సారం చేశారని విమర్శించారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కర్నూలు జిల్లాలోని కట్టమంచి స్కూల్‌లో 2017 ఆగస్టు 18వ తేదీన సుగాలి ప్రీతి ఘటన జరిగిందని గుర్తుచేశారు. ‘2014 నుంచి 2019 వరకు టీడీపీ అధికారంలో ఉంది. బీజేపీ అందులో భాగస్వామిగా ఉంది. పవన్‌కల్యాణ్ వాళ్లతో కలిసి పనిచేస్తున్నారు. ప్రీతి కేసును విచారించి నేరస్తులకు శిక్షపడేలా చర్యలు తీసుకోవాల్సిన నాటి టీడీపీ ప్రభుత్వం విఫలమైంది. నేరస్తులకు కొమ్ము కాసింది..’ అంటూ మండిపడ్డారు. ఆనాడు ప్రీతి తల్లిదండ్రులు అడగని నాయకుడు, తొక్కని గుమ్మం లేదన్నారు. 2018లో హైదారాబాద్‌లో జనసేన కార్యాలయానికి వెళ్లి పవన్‌కల్యాణ్‌కు ఫైల్ ఇచ్చారని చెప్పారు. 14 ఏళ్ల పసిబిడ్డ జీవితం నాశనమైపోతే ఎలా ఊరుకుంటారంటూ ఊగిపోయి మాట్లాడిన పవన్‌కల్యాణ్.. అప్పటి సీఎం చంద్రబాబును ప్రశ్నించలేదని, విచారణ చేయమని కోరలేదని చెప్పారు. నేరస్తులకు శిక్షపడే విధంగా చేయలేదని, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం ఆ కుటుంబానికి రావాల్సిన ప్రయోజనాలు కూడా అందించలేదని విమర్శించారు. 2017 నుంచి 2019 వరకు రెండేళ్లు కేసును తాత్సారం చేశారని విమర్శించారు.
రాజకీయంగా కేసును వాడుకొని..
తర్వాత చంద్రబాబు ప్రభుత్వం పడి పోవడంతో పవన్‌కల్యాణ్ ఈ కేసును రాజకీయంగా వాడుకుని ఎన్నికల్లో లబ్ధిపొందారని విజయ్‌కుమార్ తెలిపారు. ఎన్నికలైన తర్వాత కూడా చంద్రబాబు నేరస్తులకు కొమ్ము కాశారని, అందుకే మొదటి సంతకం అన్న పవన్ కల్యాణ్ యూ టర్న్ తీసుకున్నారని విమర్శించారు. డీఎన్‌ఏలు మ్యాచ్ కాలేదని పవన్‌కల్యాణ్‌కు ఎవరు చెప్పారని ప్రశ్నించారు. నాడు, నేడు నేరస్తులకు కొమ్ము కాస్తున్నందునే పవన్‌కల్యాణ్ ఈ కేసులో మాట మార్చారని చెప్పారు. ఈ కేసును పునర్విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నతవిద్యను నిర్లక్ష్యం చేస్తోందని ఆయన విమర్శించారు.