
పేదరిక నిర్మూలనే పీ4 లక్ష్యం
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ
నందిగామ టౌన్: పేదరిక నిర్మూలనే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా పీ4 కార్యక్రమం యజ్ఞంలా అమలవుతోందని కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ పేర్కొన్నారు. చందర్లపాడు మండలం ముప్పాళ్ల గ్రామానికి చెందిన బంగారు కుటుంబం లబ్ధిదారు కోట వెంకటరత్నం కుటుంబానికి కేసీపీ లిమిటెడ్ ప్రతినిధులతో కలిసి సోమవారం ఆయన స్థానిక ఆర్డీవో కార్యాలయం వద్ద ఆటోను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో దాదాపు లక్ష బంగారు కుటుంబాలుండగా 6,400 మంది మార్గదర్శులు ముందుకు వచ్చారన్నారు. బంగారు కుటుంబాల అభివృద్ధికి స్వల్పకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలతో చేయూతనందిస్తున్నారని అవసరమైన వారికి వైద్య, విద్య, నైపుణ్యాభివృద్ధి, స్వయం ఉపాధి మార్గాలు, ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఆటో ఖర్చులో 60 శాతం మొత్తాన్ని కేసీపీ అందించగా మిగిలిన 40 శాతంను బ్యాంకు రుణంగా అందించామని చెప్పారు. ఆర్డీవో బాలకృష్ణ, కేసీపీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మధుసూదనరావు పాల్గొన్నారు.
పాడి పరిశ్రమలో భాగస్వాములు కావాలి
చిల్లకల్లు(జగ్గయ్యపేట): రైతులు పాడి పరిశ్రమలో భాగస్వాములై విస్తరించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ పేర్కొన్నారు. చిల్లకల్లు పాల శీతలీకరణ కేంద్రంలో కృష్ణామిల్క్ యూనియన్ ఆధ్వర్యంలో పెయ్య దూడలు పెట్టే వీర్యం పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్, కేడీసీసీ బ్యాంకు చైర్మన్ నెట్టెం రఘురాం, మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులతో కలిసి సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీ4 కార్యక్రమాన్ని స్ఫూర్తిగా కృష్ణా మిల్క్ యూనియన్ పాడి రైతులను ఆదుకునేందుకు అంకిత భావంతో పని చేయటం హర్షణీయమన్నారు. పాడి పరిశ్రమకు ప్రభుత్వం తోడ్పాటునందిస్తోందన్నారు. పశు సంవర్ధక శాఖ డైరెక్టర్ దామోదర నాయుడు మాట్లాడుతూ రైతుకు పాడి గేదె ఉంటే ఆదాయ వనరుగా మారుతుందన్నారు. గ్రామాలలో పచ్చిగడ్డి అందుబాటులో ఉండేందుకు కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. మిల్క్ యూనియన్ చైర్మన్ ఆంజనేయులు మాట్లాడుతూ వీర్యం డోసు కేవలం రూ. 50లకే అందిస్తున్నామని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పశుసంవర్ధక శాఖ జేడీ హనుమంతరావు, శ్రీనివాసరావు, విజయ డెయిరీ చైర్మన్ శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.